● ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి
బనశంకరి: తమ సంస్థల వార్షిక ఆర్థిక లావాదేవీలు రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుంది, ప్రస్తుతం చిక్కింది రూ.2 కోట్లు మాత్రమే, అది మాకు పెద్ద మొత్తం కాదని ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి తెలిపారు. శుక్రవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలపై ఈడీ దాడి, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, దాడి వెనుక రాజకీయ ఉద్దేశాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రూ.2 కోట్ల సొమ్ము మాదే. దానిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేశాం. ఐటీ శాఖకు ఇప్పటికే అన్ని ఆధారాలు అందించాం. ఈడీ అడిగినా అవసరమైన ఆధారాలు అందిస్తాం. నేను ఎక్కడా కులం విషయం తెచ్చి సమర్థించుకోలేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. దీనిని పూర్తిగా చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. గత పదేళ్ల నుంచి కేవలం విపక్ష నేతలను టార్గెట్‌గా చేసుకుని దాడి చేస్తున్నారని కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై ఇలాంటి దాడులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం, నోటీస్ ఇచ్చినా చట్టబద్ధంగా సమాధానమిస్తాం అని తెలిపారు.


