దొడ్డబళ్లాపురం/బనశంకరి: బెంగళూరు దక్షిణ జిల్లా పరిధిలోని రామనగర తాలూకా దొడ్డేరి ఫాంహౌస్‌లో వెలుగు చూసిన నకిలీ మందుల తయారీ మాఫియా కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిట్, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆరు రాష్ట్రాల్లో 10 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, హరియాణ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణల్లో ఈ దాడులు చేపట్టారు. సుమారు 100 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఒక్కో ప్రదేశం నుంచి ఒక్కో రకమైన మందులు దిగుమతి చేసుకుని, వివిధ చోట్ల పలు రకాల మందులను నిల్వ చేస్తున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మాఫియాకు కింగ్‌పిన్‌గా ఉన్న ప్రశాంత్ పలువురు డీలర్ల నుంచి నకిలీ మందులు తెప్పించుకుని పేరొందిన ఆస్పత్రులకు మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయించేవారని దర్యాప్తులో తేలింది. నకిలీముఠాలో నిందితునిగా ఉన్న ప్రశాంత్, అతడి గ్యాంగ్‌తో సంబంధాలు కలిగిన వీరేశ్‌కుమార్ ఇళ్లు, కార్యాలయం, మినర్వా సర్కిల్ వద్ద కృపా హెల్త్ కేర్‌పై సిట్ అధికారులు శుక్రవారం దాడి చేశారు. ఏడాది నుంచి వీరేశ్, ప్రశాంత్ ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది. ఆస్పత్రులకు, మందుల షాపులకు మందులు సరఫరా చేసే రెప్రజెంటేటివ్‌లకు అధిక కమీషన్ల ఆశ చూపి ఈ నకిలీ మందులు విక్రయించేవారని వెల్లడైంది. సుమారు 15 మంది రెప్రజెంటేటివ్‌లు ఈ దందాలో ఉన్నట్టు గుర్తించారు. బెంగళూరు మినర్వా సర్కిల్‌లో ఉన్న గోడౌన్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు కూడా ఈ నకిలీ మందులు సరఫరా చేసేవారు. థైరాయిడ్ మందులు, విటమిన్ టాబ్లెట్లు, వివిధ రకాల ఇంజెక్షన్లు కూడా నకిలీవి తయారు చేసి నిజమైన మందులుగా ప్రముఖ కంపెనీల లేబుల్స్ అతికించి విక్రయించేవారని సమాచారం. వీరేశ్‌కుమార్ ఇళ్లు, కృపా హెల్త్‌కేర్ సంస్థ నుంచి నకిలీ ఔషధాల బిల్లులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
6 రాష్ట్రాల్లో ఏకకాలంలో సిట్ అధికారుల దాడులు


