కేపీఎస్సీ కుంభకోణంపై ఈడీ విచారణ | - | Sakshi
Sakshi News home page

కేపీఎస్సీ కుంభకోణంపై ఈడీ విచారణ

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

బనశంకరి: కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(కేపీఎస్సీ) పశువైద్యాధికారుల నియామకాల్లో అక్రమాల కేసుకు సంబంధించి ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన ఈడీ అధికారులు మధ్యవర్తి బసవరాజ్‌ కన్నాళె, ఐఏఎస్‌ అధికారి జ్ఞానేంద్రకుమార్‌ గంగ్వార్‌లను తీవ్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. కోర్టు అనుమతి తీసుకుని శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు పరప్పన అగ్రహార జైలులో వారిని ఈడీ అధికారులు విచారణ చేశారు. అవసరమైతే ఆర్థిక అక్రమాలపై దర్యాప్తునకు వారిద్దరిని బాడీ వారెంట్‌ ఆధారంగా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక వ్యవహారాలపై సీఐడీ విచారణ

కేపీఎస్సీ నియామక అక్రమాల కేసుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్న సీఐడీ అధికారులకు కీలక సమాచారం లభ్యమైంది. ఈ కేసులో కేపీఎస్సీ పరీక్షల విభాగం మాజీ కంట్రోలర్‌ జ్ఞానేంద్రకుమార్‌ గంగ్వార్‌ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేపడుతోంది. సీఐడీ దర్యాప్తు ప్రకారం బెంగళూరు డికెన్సన్‌ రోడ్డులోని జ్యువెలరీ దుకాణం నుంచి జ్ఞానేంద్రకుమార్‌ తన ప్రియురాలికి రూ.26 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి కానుకగా ఇచ్చినట్లు సమాచారం అందింది. అయోధ్యకు చెందిన ప్రియురాలిని జ్యువెలరీ దుకాణానికి తీసుకెళ్లి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం గురించి సీఐడీకి ఛాయాచిత్రాలతో సహా ఆధారాలు లభించాయి. ఆభరణాల కొనుగోలుకు సంబంధించిన బిల్లులను సైతం విచారణాధికారులు స్వాధీనం చేసుకున్నారు. బీదర్‌ లక్ష్మీ సౌహార్ద కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఆభరణాల కొనుగోలుకు డబ్బు చెల్లించినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. బసవరాజ్‌ అనే పేరిట అకౌంట్‌ నుంచి బంగారు కొనుగోలు బిల్లుల గురించి దర్యాప్తు చేపడుతున్నారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన జ్ఞానేంద్రకుమార్‌ గంగ్వార్‌ ప్రియురాలిని విచారణకు హాజరు కావాలని నోటీస్‌ ఇచ్చారు. జ్ఞానేంద్రకుమార్‌ సోదరుడు కమలాపతి పేరుతో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో విలాసవంతమైన విల్లా కొనుగోలు గురించి సీఐడీ దర్యాప్తు చేపడుతోంది. ఈ ఆస్తి అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేశారా? అనే అనుమానం సీఐడీలో ఏర్పడింది. 2024 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి వరకు జ్ఞానేంద్రకుమార్‌ కేపీఎస్సీ పరీక్షల విభాగం కంట్రోలర్‌గా పని చేశారు.

ఎంపికై న అభ్యర్థులకూ అరెస్ట్‌ భయం...

కేపీఎస్సీ అక్రమ నియామకాల కేసు దర్యాప్తులో భాగంగా పరీక్షలో ఎంపికై న కొందరు అభ్యర్థులు ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌ విచారణ 52వ సీసీహెచ్‌ కోర్టు చేపట్టనుంది. మమిత, అమరేగౌడ అనే అభ్యర్థులు బెంగళూరు 52వ సీసీహెచ్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటీషన్‌ వేశారు. కేపీఎస్సీ పరీక్షల్లో ఎంపిక కావాలనే ఉద్దేశంతో డబ్బు ఇచ్చిన ఆరోపణలు మమితపై ఉన్నాయి. గతంలో సీఐడీ అధికారులు మమిత ఇంటిపై కలబుర్గిలో దాడి చేసి మొబైల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. పశువైద్యాధికారి పోస్టుల భర్తీలో ఎంపికై న మరో అభ్యర్థి అమరేగౌడ కూడా ముందస్తు బెయిల్‌ కోసం పిటీషన్‌ వేశారు.

ఐఏఎస్‌ అధికారి జ్ఞానేంద్రకుమార్‌, మధ్యవర్తి బసవరాజ్‌లను విచారించిన ఈడీ అధికారులు

కేఏఎస్‌ పరీక్షలోనూ అక్రమాలు?

కేపీఎస్సీ పశువైద్యాధికారుల పోస్టుల నియామకాల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం కేఏఎస్‌ పరీక్షల్లో కూడా అక్రమాలు జరిగినట్లు అనుమానం వ్యక్తమౌతోంది. ఈ కేసుకు సంబంధించి కేఏఎస్‌ అభ్యర్థి మమిత కలబుర్గి నివాసంపై సీఐడీ అధికారులు దాడి చేసి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. దాడి సమయంలో కేఏఎస్‌ అక్రమాలకు సంబంధించి కీలక ఆధారాలు, ల్యాప్‌టాప్‌ను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకుని ల్యాప్‌టాప్‌లో ఉన్న డిజిటల్‌ డేటాను రిట్రీవ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. 2023–24 బ్యాచ్‌లో కేఏఎస్‌ పరీక్ష రాసి ఇంటర్వ్యూ పూర్తి చేసి ఫైనల్‌ ఫలితాల కోసం వేచిచూస్తున్న మమిత కేపీఎస్సీ సభ్యురాలు శాంతా హొసమని ద్వారా అక్రమంగా పోస్టును సాధించడానికి ప్రయత్నించారనే ఆరోపణ ఉంది. 2023లో గ్రామీణ తాగునీటి శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్ల పోస్టుల భర్తీలో కూడా కోట్లాది రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఒక ఏఈఈ పోస్టుకు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల డీల్‌ జరిగిందని ఆరోపణ. పరీక్ష ఓఎంఆర్‌ షీట్లు దిద్దడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. దీని గురించి ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో ధృవీకరించారు. మొత్తం 24 మంది అభ్యర్థులకు గాను కనీసం 10 మంది అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement