మార్మోగిన ప్రభువు నామ జపం
సాక్షి,బళ్లారి: పవిత్రమైన ఏసుక్రీస్తు జన్మించిన రోజున క్రైస్తవ సోదరులు ఏసునామాన్ని జపించి పునీతులయ్యారు. నగరానికే తలమానికంగా ఉన్న, పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఆరోగ్యమాత చర్చి క్రైస్తవ సోదరులతో నిండిపోయింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆరోగ్యమాత చర్చికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త దుస్తులు ధరించి, కుటుంబ సభ్యులతో చర్చికి వచ్చి, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్లు కూడా ఆరోగ్యమాత చర్చిలో ఉండి చర్చికి వచ్చిన వారితో ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. నగరంలోని సీఏస్‌ఐ తెలుగు, సీఎస్‌ఐ కన్నడ, సీఎస్‌ఐ ఇంగ్లిష్, క్యాథలిక్ తదితర చర్చిల్లో ఎక్కడ చూసినా క్రీస్తు నామాన్ని జపిస్తూ ఆరాధించారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చిలన్ని క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా బళ్లారి కేంద్రంగా వివిధ జిల్లాలకు ధర్మగురువుగా పేరుగాంచిన బిషప్‌ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుని ప్రార్థనలు కూడా చేశారు. ఆయా చర్చిల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
రాయచూరు రూరల్: ఏసు క్రీస్తు జన్మదినోత్సవం సందర్భంగా గురువారం క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా ఆచరించారు. క్రైస్తవ సోదరులు నగరంలోని అగాపె, మెథడిస్ట్, క్యాథలిక్, కాన్వెంట్ స్కూలు చర్చిల్లో ప్రార్థనలు జరిపారు. మెథడిస్ట్ చర్చిలో ఫాదర్ సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ శాంతి, సౌభ్రాతృత్వం, సోదరత్వం, ఆత్మీయతను కల్గి ఉండాలని కోరారు. రైల్వేస్టేషన్ సర్కిల్‌లో రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. పలు చర్చిల్లో ప్రభు ఏసు క్రీస్తును వివిధ రూపాల్లో అలంకరించడంతో పాటు సందేశాలిచ్చే సాంకేతిక విషయాలను కూడా పొందుపర్చారు. చర్చిలో ఫాదర్లు వరప్రసాద్, బి.జాన్, అబ్రహాం జాన్, సమ్సోన్ జేమ్స్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ప్రార్థనల్లో జయన్న, రమేష్, రాజేష్, తిమ్మారెడ్డి, దానప్ప యాదవ్, రవి పాల్గొన్నారు.
విజయనగరలో క్రిస్మస్ సందడి
హొసపేటె: క్రిస్మస్ పర్వదిన వేడుకలను గురువారం విజయనగర జిల్లాలోని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పలు చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యాయి. ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పండుగ వాతావరణంతో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని తెలుగు సీఎస్‌ఐ చర్చితో ఆయా చర్చిలలో క్రైస్తవులు ప్రార్థనా గీతాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చర్చి ప్రాంగణాలు ఆధ్యాత్మిక సందేశాలతో మార్మోగాయి. శాంతి, ప్రేమ, సోదరభావం అనే సందేశాలను పాస్టర్లు ఉపదేశించారు. చర్చి ప్రాంగణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. చర్చిల ప్రధాన ద్వారాలు విద్యుత్ కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, చర్చిల ప్రాంగణాలు శోభాయమానంగా మారాయి. క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. జిల్లా వ్యాప్తంగా చర్చిలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించగా, ప్రత్యేక ప్రార్థనలతో సందడి నెలకొంది. పేదలకు అన్నసంతర్పణ, అవసరమైన వారికి ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలను కూడా చర్చిల ఆధ్వర్యంలో చేపట్టారు.
బళ్లారి బిషప్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులు
హొసపేటెలోని చర్చిలో ప్రార్థనలు చేస్తున్న దృశ్యం
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ ఆచరణ వేడుకలు
చర్చిల్లో కులమతాలకతీతంగా ప్రార్థనలు
అంబరం.. క్రిస్మస్ సంబరం
బళ్లారి రూరల్ : క్రిస్మస్ పండుగలో భాగంగా గురువారం నగరంలోని ప్రధాన మేరీమాత చర్చిలో విశేష ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచే క్రైస్తవ సోదరులు ఏసుప్రభువును దర్శించుకొన్నారు. చర్చిలో ఫాదర్లు భక్తులను దీవించారు. కుల మత భేదాలు లేకుండా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు చర్చికి వచ్చి కరుణామయుడి కటాక్షం కోసం కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థించారు. మేరీమాత చర్చి ప్రాంగణమంతా జనసందోహంతో నిండిపోయింది. అదేవిధంగా బత్రి రోడ్డులోని ఎఫ్‌బీఏబీ చర్చిలో కూడా ప్రార్థనలు నిర్వహించారు. విద్యారులు యేసయ్య భక్తి కీర్తనలతో నృత్యాలు చేశారు.
మార్మోగిన ప్రభువు నామ జపం


