సాక్షి, బళ్లారి: బెంగళూరు నుంచి గోకర్ణకు బయలుదేరిన ప్రైవేటు సీబర్డ్ స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సును– కంటైనర్ లారీ ఢీ కొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులోని నలుగురు యువతులు, ఓ బాలిక, లారీ డ్రైవర్ కలిసి ఆరు మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకాలో 48వ హైవేలో జరిగిన ఘోర దుర్ఘటన ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. సుమారు 25 మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
డ్రైవర్ రఫీ మృతి
బస్సు డ్రైవర్ మహమ్మద్ రఫీ హుబ్లీ కేఎంసీఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ప్రమాదం జరగగానే కిటికీలో నుంచి రఫీ దూకేశాడు. ఆ సమయంలో కాళ్లు చేతులకు గాయాలు తగిలాయి, కానీ కోలుకోలేకపోయాడు. దీంతో మృతుల సంఖ్య 7కు పెరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గాయపడినవారు ఇప్పటికీ ఆ ఘోరాన్ని తలచుకుని వణికిపోతున్నారు.
బయటపడ్డ బండారి
యశవంతపుర: కార్వార కుమటాకు చెందిన విజయ్ బండారి అనే యువకుడు ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఆ తొందరలో మొబైల్‌ఫోన్, లగేజీని బస్సులోనే వదిలేయడంతో బూడిదయ్యాయి. కుటుంబసభ్యులను సంప్రదించడం వీలు కాకపోయిందని చెప్పాడు. చివరికి ఎలాగో వారికి క్షేమ సమాచారం పంపించాడు.
నవ్య– మానస చావులోనూ స్నేహబంధం
అందరి మృతదేహాలు హుబ్లీ కిమ్స్ ఆస్పత్రిలో ఉండడంతో కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరారు. నవ్య కుటుంబ సభ్యుల వేదనను ఆపడం ఎవరితరమూ కాలేదు. మృతులు నవ్య, మానస ఒకటవ తరగతి నుంచి స్నేహితులని, ఎంటెక్ వరకు ఒకే కాలేజీలో చదువుకొని బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. హాసన్ జిల్లా చెన్నరాయపట్టణవాసి మానస, మండ్య జిల్లా కేఆర్ పేట తాలూకావాసి నవ్య. నిజానికి ఒకే రోజు తమ తమ పెళ్లిళ్లు జరగాలని కూడా అనుకున్నారు. మృత్యువులోనూ కలిసే వెళ్లారని బంధువులు తెలిపారు. ఎవరి మృతదేహం ఎవరిదో తెలియనంతగా కాలిపోవడంతో మృతుల బంధువుల నుంచి, శవాల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదికలను బట్టి మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నివేదికలు వస్తాయని చెప్పారు.
కళ్ల ముందే స్నేహితురాలు..
బనశంకరి: బస్సు ప్రమాదంలో గాయపడిన టెక్కీ గగనశ్రీ బెంగళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో శుక్రవారం ఆ ఘోర దుర్ఘటన గురించి వివరించింది. బస్‌లో పైన సీటులో నిద్రపోయిన నేను, ప్రమాదం జరిగిన వెంటనే రక్షితతో కలిసి బయటకు దూకాము. రశ్మి కూడా దూకేలోపు ఆమె మంటల్లో చిక్కుకుందని తెలిపింది. గోకర్ణ కు వెళ్లి రశ్మి ఇంటికి వెళ్లాల్సి ఉంది, బస్‌లోపల ఉన్న లగేజీ బ్యాగుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి, రశ్మి బయటకు రావడానికి దేవుడు సమయం ఇవ్వలేదు అని ఆమె ఆవేదన చెందింది. మృతురాలు రశ్మి మురుడేశ్వరవాసి. ఈ ముగ్గురు ప్రమాదానికి ముందు తీసుకున్న ఫోటో వైరల్ కావడం తెలిసిందే.
ప్రి వెడ్డింగ్ పారీ్టపై నిప్పులు
బాధితుల్లో 7 మంది బృందం బెంగళూరు మావళ్లి, బిన్నిమిల్స్‌వాసులు. మంజునాథ్– కాబోయే భార్య కవిత, స్నేహితులు దిలీప్, సంధ్య, శశాంక్, బిందు–ఆమె కూతురు గ్రేయ. వీరందరూ బెంగళూరులో టెక్కీలుగా పనిచేస్తారు. మంజునాథ్– కవితకు ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో స్నేహితులకు గోకర్ణలో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలనుకుని అందరూ ఈ బస్సులో ఎక్కారు. మంజునాథ్‌కు తీవ్ర కాలినగాయాలు కాగా, బెంగళూరు విక్టోరియాలో చికిత్స పొందుతున్నాడు. ఇక దిలీప్‌కు బిందు సొంత సోదరి అవుతుంది. ఇలా ఒకరికొకరికి బంధుత్వాలు కూడా ఉన్నాయి. బిందు, ఆమె కూతురు ప్రమాదంలో చనిపోయారు.


