సారూ.. తాగారా?
యశవంతపుర: మద్యం తాగి వాహనాలను నడిపేవారిని బెంగళూరు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గత మూడురోజుల నుంచి ముమ్మరం చేశారు. దీంతో మత్తులో డ్రైవింగ్ చేస్తున్న 507 వాహనదారులను గుర్తించి కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో కొత్త ఏడాది సందర్భంగా కై పులో నడిపి ప్రమాదాలు జరపకుండా సిటీలో ప్రముఖ కూడళ్లలో తనిఖీలు సాగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ అధికం చేశారు. 33,375 వాహనాలను తనిఖీ చేయగా 507 వాహనదారులు తాగినట్లు రుజువైంది. దీంతో వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.
బెంగళూరులో భారీగా
నకిలీ ఓట్లు: విజయేంద్ర
దొడ్డబళ్లాపురం: బెంగళూరు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల నుంచి 15 వేల వరకూ నకిలీ ఓట్లు చేర్చారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా మహాలక్ష్మిలేఔట్ ఎమ్మెల్యే ఆఫీసులో వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఓటర్ల లిస్టులో నకిలీ పేర్లను నమోదు చేయించిందన్నారు. బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ క్షేత్రాల్లో ఈ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎన్నికల కమిషన్ సమగ్రంగా తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వరుస ఓటములతో మతి భ్రమించి కాంగ్రెస్ ఓటు చోరీ అంటూ గగ్గోలు పెడతోందన్నారు.
నవ వివాహిత
అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం: నవ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన బెంగళూరు పరిధిలోని నెలమంగలలో జరిగింది. ఐశ్వర్య (26) మృతురాలు. ఈమెకు నెల క్రితం లిఖిత్ అనే యువకునితో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే వారం రోజులకే లిఖిత్ ఐశ్వర్యను వేధించడం ప్రారంభించాడని బంధువులు చెబుతున్నారు. ఇరు వైపులా పెద్దలు పంచాయితీ చేసి రాజీ చేశారు. అయినా లిఖిత్ ప్రవర్తనలో మార్పు రాలేదు. బుధవారం సాయంత్రం లిఖిత్ ఐశ్వర్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఐశ్వర్య ఇంట్లో ఓ గదిలో ఉరివేసుకున్న స్థితిలో శవమైంది. బాగలగుంట పోలీసులు కేసు నమోదు చేసి లిఖిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సర్ఫరాజ్ వద్ద భారీగా ఆస్తులు
యశవంతపుర: ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్), కేఏఎస్ అధికారి సర్పరాజ్‌ఖాన్ వద్ద రూ.14.38 కోట్ల విలువగల ఆస్తులు ఉన్నట్లు లోకాయుక్త గుర్తించింది. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రమే. మార్కెట్ విలువ ప్రకారమైతే అంతకు ఏడెనిమి రెట్లు ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఆయన గతంలో సహకార సంఘాల లెక్క పరిశోధనా విభాగం డైరక్టర్‌గాను, బీబీఎంపీ పని చేశారు. త్వరలో రిటైరు కానున్నారు, ఈ సమయంలో లోకాయుక్త కొరడా ఝులిపించడంతో భారీ మొత్తంలో ఆస్తులు బయట పడ్డాయి.
శాంతలింగ శివాచార్య స్వామీజీ అరెస్టు
దొడ్డబళ్లాపురం: గాల్లోకి కాల్పులు జరిపిన కలబుర్గి జిల్లా ఉడచణ గ్రామం హీరేమఠంలోని శివాచార్యస్వామి మఠం స్వామీజీ శాంతలింగ శివాచార్య స్వామీజీని కలబుర్గి పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజులక్రితం స్వామీజీ మద్యం తాగివచ్చి మఠంలో హల్‌చల్ చేశాడు. దీంతో గ్రామస్తులు ఆయనను బయటకు పంపించేశారు. కొత్త మఠాధిపతిని నియమించేందుకు గ్రామస్తులు ప్రయత్నాలు చేస్తుండగా స్వామీజీ మఠం ఆవరణలోనే తుపాకితో గాల్లోకి కాలులు జరిపి వీడియోలకు ఫోజులిచ్చాడు. ఇది వైరల్ కావడంతో సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు స్వామీజీని అరెస్టు చేశారు.
సారూ.. తాగారా?
సారూ.. తాగారా?


