చిత్రదుర్గం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
గడ్డకట్టే చలి మధ్యలో ట్రావెల్స్ బస్సు దూసుకెళ్తోంది. కొన్ని గంటల తరువాత గోకర్ణలో బీచ్ ఒడ్డున హ్యాపీగా
ఉంటామని ప్రయాణికులు ఊహించుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. ఇంతలోనే ఏదో పేలుడు వంటి శబ్ధం. కళ్ల ముందు ఇంతెత్తున మంటలు. ఎటుచూసినా హాహాకారాలు. ఓ ఘోర ప్రమాదం ఎన్నో జీవితాల్లో విషాదాన్ని చిమ్మింది.
సాక్షి బళ్లారి/ తుమకూరు/ బనశంకరి: చిత్రదుర్గంజిల్లా హిరియూరు గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జవనగొండనహళ్లి వద్ద గురువారం తెల్లవారుజామున హైవే – 48లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టడంతో దారుణం సంభవించింది. బస్సు మంటల్లో చిక్కుకోగా నలుగురు యువతులు, ఓ చిన్నారి బాలిక, అలాగే లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యారు.
ఎలా జరిగిందంటే..
● బెంగళూరు నుంచి గోకర్ణకు సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ (కేఏ01 ఏఈ5217) స్లీపర్ బస్సు బయల్దేరింది.
● వరుస సెలవులు రావడంతో ఎక్కువమంది టెక్కీలు, ప్రైవేటు ఉద్యోగులు టూర్ కోసం బయల్దేరారు. నిద్రమత్తులోకి జారుకున్న కంటైనర్ లారీ డ్రైవర్ అదుపు కోల్పోయాడు, లారీ డివైడర్ మీద నుంచి దూసుకొని వచ్చి ప్రైవేటు బస్సును ఢీకొనింది. డీజిల్ ట్యాంకు పేలి మంటలు క్షణాల్లో బస్సును ఆవహించాయి.
● బస్సులో బిందు, ఈమె కుమార్తె గ్రేయ (5), మానస, నవ్య, రశ్మి అనేవారు మంటల్లో చిక్కి చనిపోయారు. మృతదేహాలు మసిబొగ్గులుగా మారాయి. బాలిక తప్ప మిగతా నలుగురు యువతులు బెంగళూరులో టెక్కీలని తెలిసింది.
● లారీని కూడా మంటలు చుట్టుముట్టి డ్రైవరు మరణించాడు.
● బస్సులోని మరో 25 మంది గాయాల పాలయ్యారు. ముగ్గురి జాడ దొరకడం లేదు.
● భారీ శబ్ధాలు రావడంతో స్థానిక గ్రామస్తులు వచ్చి రక్షించే యత్నం చేశారు. పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు.
గాయపడినవారు వీరే..
మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రతీశ్వరన్, కవిత, అనిరుధ్, అమృత, ఇషా, సూరజ్, మిలన్, విజయ్, అభిషేక్, కిరణ్‌పాల్, కీర్తన, నందిత, దేవిక, మేఘరాజ్, హేమరాజ్ కుమార్, కల్పన ప్రజాపతి, రక్షిత, గగనశ్రీ, మహమ్మద్ సాదిక్, ఆదిత్య, వరుణ్ అనేవారు గాయపడినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. శిర, హిరియూరు, తుమకూరు, బెంగళూరు ఆస్పత్రుల్లో బాధితులను చేర్చారు. ఓ మృతురాలి లాకెట్‌ను చూసి తండ్రి కన్నీరు పెట్టారు. కూతురిని కడసారి చూద్దామంటే కనీస ఆనవాళ్లు లేవు. చిత్రదుర్గ ఆస్పత్రిలో గాయపడిన వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతులపై కొంత సందిగ్ధం నెలకొంది.
నలుగురు మహిళా టెక్కీలు,
చిన్నారి సజీవ దహనం
లారీ డ్రైవర్ కూడా మృత్యువాత
మరో 25 మందికి గాయాలు
బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు
చిత్రదుర్గం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


