పని కల్పించలేదు.. అప్పు ఇవ్వలేదంటూ హత్య | - | Sakshi
Sakshi News home page

పని కల్పించలేదు.. అప్పు ఇవ్వలేదంటూ హత్య

Dec 25 2025 8:29 AM | Updated on Dec 25 2025 8:29 AM

పని కల్పించలేదు..  అప్పు ఇవ్వలేదంటూ హత్య

పని కల్పించలేదు.. అప్పు ఇవ్వలేదంటూ హత్య

మైసూరు: తనకు అప్పు ఇవ్వలేదు, పైగా చేసేందుకు పని కల్పించలేదనే అక్కసుతో ఒక వ్యక్తిపై యువకుడు దాడి చేసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పిరియాపట్టణ తాలూకా భోగనహళ్లి గ్రామంలో జరిగింది. భోగనహళ్లి గ్రామానికి చెందిన బీటీ స్వామి గౌడ (56)వద్దకు అదే గ్రామానికి చెందిన గోవింద అనే యువకుడు వచ్చి అప్పు అడిగాడు. అయితే తన వద్ద డబ్బు లేదని బీటీ స్వామిగౌడ చెప్పాడు. ఏదైనా పని ఇస్తే చేస్తానని గోవింద చెప్పాడు. ఇతరులకు పని ఇచ్చే స్థోమత తనకు లేదని గౌడ చెప్పాడంతో గోవింద ఆగ్రహానికి గురై బీటీస్వామిగౌడపై దాడి చేశాడు. ఘటనలో స్వామిగౌడ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పిరియూ పట్టణ పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు. హతుడి అక్క కుమారుడు బీకే ప్రతాప్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు గోవిందను అరెస్టు చేశారు.

టెక్కీకి తేనె వల వేసి దోపిడీ

ఇద్దరు మహాళలు సహా ఐదుగురి అరెస్ట్‌

యశవంతపుర: టెక్కీకి తేనె వల వేసి డబ్బుదోచుకొని దాడికి పాల్పడిన ఘటన ఇద్దరు మహిళలతోసహా ఐదుగురిని బెంగళూరు ఆర్‌ఆర్‌ నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమలతా అలియాస్‌ అంజలి, అన్నపూర్ణేశ్వరినగరకు చెందిన హర్షిణి అలియాస్‌ స్వీటీ, జగదీశ్‌, లోకేశ్‌, మంజునాథ్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 10న టెలిగ్రాం ద్వారా టెక్కికీ ఒక అమ్మాయి పరిచయమైంది. ఇంటివద్దకు పిలిపించి రూ.20 వేలు లాక్కుంది. అనంతరం తన స్నేహితురాలిని పిలిపించి ఆమె ద్వారా మళ్లీ రూ.20 వేలు లాక్కుంది. మరో రూ.40వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా టెక్కీ నిరాకరించాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేసి సెల్‌ఫోన్‌, నగదు లాక్కున్నారు. బాధితుడు తప్పించుకొని 112కు ఫోన్‌ చేశాడు. హొయ్సళ పోలీసులు వచ్చి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ అరెస్ట్‌ విషయాన్ని బుధవారం ప్రకటించారు.

ప్రియుని మోజులో పడి

కన్నబిడ్డ విక్రయం

దొడ్డబళ్లాపురం: ప్రియుని మోజులో పడిపోయిన మహిళ తమ ఆనందానికి అడ్డు వస్తోందని భావించి కన్నబిడ్డను విక్రయించింది. ఈ సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఐశ్వర్య అనే మహిళ తన భర్తతో విడిపోయి చంద్రప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆమెకు అప్పటికే రెండేళ్ల కుమార్తె ఉంది. తమ ఆనందానికి కుమార్తె అడ్డుగా ఉందని భావించిన ఐశ్వర్య...కొప్పళకు చెందిన ఒకరికి బ్రోకర్‌ ద్వారా చిన్నారిని రూ.50 వేలకు విక్రయించింది. మూడు రోజులుగా ఐశ్వర్య కుమార్తె కనిపించకపోవడం, ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఐశ్వర్యను విచారణ చేపట్టగా అసలు విషయం చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్యను అరె స్ట్‌ చేశారు. పరారీలో ఉన్న చంద్రప్ప, బ్రోకర్ల కోసం గాలిస్తున్నారు. అధికారులు చిన్నారిని రక్షించే పనిలో పడ్డారు.

అక్రమంగా కబేళా.. ఇద్దరి అరెస్ట్‌

మైసూరు: తాలూకాలోని హుల్లహళ్లి జేఎస్‌ఎస్‌ కాలేజీ వెనుక ఓ షెడ్‌లో అక్రమంగా కబేళా నిర్వహిస్తూ గొడ్డు మాంసం విక్రయిస్తుండగా హుల్లహళ్లి ఎస్‌ఐ చేతన్‌ కుమార్‌ బుధవారం దాడి చేశారు. మహ్మద్‌, అయూబ్‌ఖాన్‌ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేసి 34 కేజీల గొడ్డు మాంసం, ఇనుప కొక్కెం, కత్తి, సతార్‌, తక్కెడను స్వాధీనపరచుకున్నారు.

హెలిరైడ్‌తో కార్వార అందాల వీక్షణ

యశవంతపుర: కరావళి ఉత్సవంలో భాగంగా పర్యటకశాఖ తంబి ఏవియేషన్‌ సంస్థచే హెలికాఫ్టర్‌ రైడ్‌ను బుధవారం ప్రారంభించింది. కార్వార లండన్‌ వంతెన సమీపంలోని మైదానంలో హెలి రైడ్‌ను ఎమ్మెల్యే సతీశ సైల్‌ ప్రారంభించారు. తొలుత ఆశానికేతన పాఠశాలకు చెందిన చెవుడు, మూగ చిన్నారులను హెలికాప్టర్‌లో ఎక్కించి విహారం చేయించారు. కాగా ప్రతి రైడ్‌ 7 నిముషాలపాటు కొనసాగుతుంది. కార్వార నగరం చుట్టుపక్కల అందాలను వీక్షించే ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ లక్ష్మీప్రియా, జెడ్పీ సీఇఓ దిలీష్‌శశిలు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే సతీశసైల్‌ నృత్యాలు చేస్తూ గాయకుడిలా పాటలు పాడి అందరిని అశ్చర్య పరిచారు.

బెయిల్‌ కోసం హైకోర్టుకు భైరతి

బనశంకరి: రౌడీషీటర్‌ బిక్లు శివ హత్య కేసులో పరారీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే భైరతి బసవరాజ్‌ ముందస్తు బెయిలు పిటీషన్‌ను ప్రజా ప్రతినిధి కోర్టు తిరస్కరించడం తెలిసిందే. దీంతో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం బుధవారం మళ్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. హత్య కేసులో ఇప్పటికే సీఐడీ పోలీసులు 18 మందిని విచారించి 4236 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు.

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్‌

మైసూరు: మైసూరు జిల్లా కేఆర్‌నగర పట్టణంలోని చీరహళ్లి మెయిన్‌ రోడ్డులో కారులో గంజాయి ఉంచి విక్రయిస్తున్నారనే సమాచారంతో కేఆర్‌నగర వలయ ఎకై ్సజ్‌ సీఐ వైఎస్‌ లోకేష్‌, ఎస్‌ఐ సీవీ రాఘవేంద్ర, ఎకై ్సజ్‌ బీఈ శివకుమార్‌ దాడి చేశారు. కొడగు జిల్లా మక్కందూరు పోస్ట్‌ రాజరాజేశ్వరినగర నివాసి వీ.మహమ్మద్‌ మిర్షద్‌(23), కుశాలనగర ఖలందర్‌ క్యాంప్‌ నివాసి ఎల్‌.పద్మనాభ(23)ను అరెస్ట్‌ చేసి 974 గ్రాముల విత్తన మిశ్రిత ఎండు గంజాయి, కారును స్వాధీనపరచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement