సిద్దుకు మద్దతుగా మైసూరులో సభ
యాత్రా ఫలం ఏమిటో అని అంతటా ఉత్కంఠ
శివాజీనగర: ఎడతెగని టీవీ సీరియల్ మాదిరిగా ముఖ్యమంత్రి మార్పిడి తతంగం కొనసాగుతోంది. హైకమాండ్ నేతలు ఒకమాట, సీఎం సిద్దరామయ్య మరో మాట చెబుతూ ఉంటే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారనే చెప్పాలి. సీఎం మార్పిడి ఏదీ లేదనేలా సిద్దరామయ్య, హైకమాండ్ ప్రకటనలు ఉంటున్నాయి.
మాట్లాడాలని వెళితే..
ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. హైకమాండ్ నాయకులు కన్నడ రాజకీయంలో జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రముఖ నాయకులు శివకుమార్ భేటీకి సమయాన్ని ఇవ్వకపోవడం పెద్ద చర్చకు కారణమైంది. మంగళవారం నుంచి హస్తినాపురిలో ఉంటున్న శివకుమార్ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఇతర హైకమాండ్ నాయకులను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవరూ అందుబాటులోకి రావడం లేదని సమాచారం.
ఎందుకు ఇవ్వడం లేదు?
రాష్ట్రంలో సిద్దరామయ్య వర్గం ఏర్పాటు చేస్తున్న అహింద బహిరంగ సభకు అడ్డుకట్ట వేయాలని డీకే నిశ్చయంతో ఉన్నారు. మంగళవారం కేంద్ర మంత్రులతో రాష్ట్ర ప్రాజెక్టుల గురించి చర్చలు జరిపారు. బుధవారం పార్టీ సీనియర్లను కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చకు చెమటోడుస్తున్నారు. అయితే పెద్దల దర్శనాలు దొరకడం లేదు. భేటీకి ఎవరూ సమయాన్నే ఇవ్వలేదని తెలిసింది. ఇది డీకే శివకుమార్ వర్గాన్ని కలచివేస్తోంది. గత నెల డీకే ఢిల్లీకి వెళ్తే, రాహుల్‌గాంధీతో అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఆపై అధికార మార్పిడి ఒప్పందం అమలుకు డీకే పట్టుబట్టారు. ఇది పార్టీలో గందరగోళం కల్పించింది. మల్లికార్జున ఖర్గేని పలుసార్లు భేటీ చేసి ఒత్తిడి చేయడం కూడా ఢిల్లీ నాయకులకు తలనొప్పిగా పరిణమించింది. అందుచేతనే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం సీటు రగడ భగ్గుమనే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
27వ తేదీపైనే ఆశలు
సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ రాహుల్‌గాంధీకి లేఖ రాసి వేడి పుట్టించారు. ఈ నెల 27న కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు డీకే శివకుమార్ వెళ్తారు, తాను వెళ్లనని సిద్దరామయ్య మొన్ననే చెప్పారు. ఆ సమావేశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని డీకే పట్టుదలతో ఉన్నారు. ఇందులో ఫైనల్ రౌండ్ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు.
దర్శనం ఇవ్వని హైకమాండ్ నేతలు?
డిప్యూటీ సీఎం విశ్వ ప్రయత్నాలు
సీఎం కుర్చీ చుట్టూ తీవ్ర రాజకీయం
కురీ ఆటలో సీఎం సిద్దరామయ్య తన అహింద కార్డును తీశారు. గతంలో ఆయన దళిత, బీసీ, మైనారిటీల కోసమని అహింద అనే సంస్థను నెలకొల్పడం తెలిసిందే. మైసూరులోని వస్తు ప్రదర్శన మైదానంలో త్వరలోనే భారీ సభ జరపాలని అహింద నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సిద్దరామయ్యకు మద్దతుగా ఈ సభ జరుగుతుంది. సిద్దరామయ్యనే కొనసాగించాలనేది సభ ముఖ్య ఉద్దేశం. కనీసం 20 వేల మందితో సభ జరపనున్నారు. కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనేలా రంగం సిద్ధమవుతోంది. సిద్దరామయ్య అండతోనే సభ జరుగుతోందని సమాచారం. సాహితీవేత్తలు, మేధావులను ఆహ్వానించాం, సిద్దరామయ్యను పిలవలేదు, ఆయన తరఫున మేము సభ జరపబోతున్నాం అని నాయకుడు శివరాం తెలిపారు. జనవరి ఆఖరులో సభ ఉంటుంది.
సిద్దుకు మద్దతుగా మైసూరులో సభ
సిద్దుకు మద్దతుగా మైసూరులో సభ


