చెరువుల్లో చెత్త.. యంత్రంతో తొలగింపు
మడివాళ చెరువులో శుద్ధీకరణ యంత్రం
బనశంకరి: బెంగళూరు చెరువుల నగరంగా పేరుపొందింది. అయితే అనేక చెరువులు నేడు కబ్జాల వల్ల అదృశ్యమయ్యాయి. ఉన్న చెరువులేమో వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మడివాళ చెరువులో గుర్రపుడెక్క, నాచు తొలగించి శుద్ధీకరణ చేసే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇతర చెరువుల్లో కూడా ఉపయోగిస్తామని జీబీఏ కమిషనర్ మహేశ్వర్‌రావ్ తెలిపారు. బుధవారం మడివాళ చెరువులో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నగర చెరువులకు జలకళ తీసుకురావాలనే కొత్తగా ఈ అత్యాధునిక యంత్రాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. దీని ఖరీదు రూ.1.28 కోట్లని, రోజుకు 5 టన్నులు వరకు చెత్తను తొలగిస్తుందని చెప్పారు. జీపీఎస్ వ్యవస్థ ద్వారా నిర్దేశిత ప్రాంతంలో పనిచేయించవచ్చని చెప్పారు. మడివాళ చెరువు ను రూ.15 కోట్లతో సుందరీకరిస్తామని తెలిపారు. నడక దారి, కాలువలు, పిల్లల పార్కు, పడవ విహారం, ఆటవస్తువులు తదితరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెరువుల్లోకి చెత్త వేయరాదని నగరవాసులను కోరారు.
బెంగళూరులో స్వచ్ఛతకు నాంది


