చెరువులోకి కారు బోల్తా, ఒకరు మృతి
శివమొగ్గ: కారు చెరువులోకి బోల్తా పడటంతో ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. బుధవారం ఉదయం జిల్లాలోని శికారిపుర తాలూకా ఆనవట్టి సమీపంలో కనెకొప్ప హొసూరు వద్ద జరిగింది. వివరాలు.. మృతుడిని శికారిపుర తాలూకా పునేదహళ్లి నివాసి నవీన్ (21)గా గుర్తించారు. తెల్లవారుజామున 3.20 గంటలకు శికారిపుర నుంచి ఆనవట్టి వైపునకు ఇకో కారులో నలుగురు బయలుదేరగా కనెకొప్ప హొసూరు రోడ్డు మలుపు వద్ద చెరువులోకి పల్టీలు కొట్టింది. నవీన్ గాయాలతో చనిపోగా, రామచంద్ర అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని కోసం గాలింపు జరుగుతోంది. రుద్రేశ్, మంజునాథ్ అనే ఇద్దరు క్షేమంగా తప్పించుకున్నారు.
బాల్య వివాహానికి బ్రేక్
మైసూరు: నగరంలోని షబ్బీర్‌నగర 2వ అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని ఏఎం ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న మైనర్ బాలిక వివాహాన్ని బుధవారం మహిళా శిశు సంక్షేమ, పోలీసు అధికారులు అడ్డుకున్నారు. అక్కడ బాలికకు పెళ్లి చేస్తున్నారని అధికారులకు 1098 సహాయవాణి ద్వారా సమాచారం అందింది. వెంటనే అధికారులు వెళ్లి నిలుపుదల చేశారు. ప్రస్తుతం బాలిక వయస్సు 17 ఏళ్లు కాగా పెళ్లికి 18 ఏళ్లు నిండి ఉండాలి అని ఇరువర్గాలకు వివరించారు. 18 ఏళ్లు నిండేవరకు పెళ్లి చేయబోమని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం రాయించుకున్నారు. అధికారులు కే.సోమయ్య, ఎస్‌జీ హరీష్, జయశ్రీ అంగడి, ఎస్‌ఐ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
మహిళపై పెట్రోలు పోసి నిప్పు
దొడ్డబళ్లాపురం: కుమార్తెతో వివాహం జరిపించలేదనే అక్కసుతో ఆమె తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేశాడో కిరాతకుడు. ఈ సంఘటన బెంగళూరు బసవేశ్వరనగరలోని భోవి కాలనీలో జరిగింది. ముత్తు అనే యువకుడు గీత అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేశాడు. బాధితురాలు గీత స్థానికంగా కిరాణా అంగడిని నడుపుతోంది. పక్కనే ముత్తు కూడా టీస్టాల్ పెట్టుకున్నాడు. ఈక్రమంలో గీత కుమార్తైపె కన్నేసిన ముత్తు.. తనకిచ్చి వివాహం చేయాలని పలుమార్లు కోరాడు. అయితే గీత నిరాకరించింది. కక్ష పెంచుకున్న ముత్తు గీత మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడ్డ గీతను స్థానికులు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ముత్తు పరారీలో ఉన్నాడు. బసవేశ్వరనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ప్రేమించలేదని యువతిపై దాడి
బనశంకరి: ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడు ప్రేమించాలని వేధిస్తూ యువతిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవీన్‌కుమార్ అనే నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు. వివరాలు.. టెలికాలర్‌గా పనిచేస్తున్న యువతికి 2024లో ఇన్‌స్టా ద్వారా నవీన్‌కుమార్ పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు కాల్స్, మెసేజ్ చేస్తున్న నవీన్‌కుమార్ ప్రేమించాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అతన్ని తిరస్కరించింది. యువతి గత సోమవారం మధ్యాహ్నం పీజీ హాస్టల్ వద్ద నిలబడి ఉండగా కారులో వచ్చిన నవీన్‌కుమార్ గొడవపడి దాడి చేసి, యువతి బ్యాగ్‌ను లాక్కుని ఉడాయించాడు. దాడి దృశ్యాలు పీజీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
2 లగ్జరీ కార్లు దగ్ధం
దొడ్డబళ్లాపురం: ఇంటి ముందు నిలిపిన లగ్జరీ కార్లు కాలిపోయిన సంఘటన బెంగళూరు జేపీ నగరలో జరిగింది. వడ్డరపాళ్యలో ప్రైవేటు స్కూలు యజమాని మంజునాథ్ రోజూలాగే ఇంటి ముందు బీఎండబ్ల్యూ కారు, మరో ఖరీదైన కారును నిలిపాడు. బుధవారం తెల్లవారుజామున కార్లలో మంటలు చెలరేగి కాలిపోయాయి. అగ్నికీలలు వ్యాపించి అక్కడే నిల్వ ఉంచిన టేక్ వుడ్ కూడా భారీ మొత్తంలో బూడిదైంది. ఫైర్ సిబ్బంది సమాచారం తెలుసుకుని వచ్చేసరికి అన్నీ ఆహుతయ్యాయి. కార్లలోనే మంటలు పుట్టాయా, లేక ఆకతాయిల పనా? అనేది తేలాల్సి ఉంది. కోణనకుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చెరువులోకి కారు బోల్తా, ఒకరు మృతి
చెరువులోకి కారు బోల్తా, ఒకరు మృతి


