పావురాన్ని పట్టుకోబోయి బాలుడికి తీవ్ర గాయాలు
హుబ్లీ: పావురాన్ని పట్టుకొనేందుకు ప్రయత్నించిన బాలుడు అదుపు తప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడిన ఘటన కొప్పళలోని హమాలీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. ఆ బాలుడిని అబ్బాస్ అలీ కుమారుడు అహ్మద్ హ్యారీస్(6)గా గుర్తించారు. తొలి అంతస్తులో బాలుడు ఆడుకుంటుండేవాడు. అయితే అక్కడికి వచ్చిన ఓ పావురాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించి తొలి అంతస్తు గ్రిల్ వద్ద నిలబడిన క్రమంలో అదుపు తప్పి ఆకస్మికంగా కింద పడ్డాడు. తక్షణమే తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడు భవనం పైనుంచి కిందకు పడే దృశ్యం సీసీ టీవీ కెమెరాలో నమోదైంది. తలకు తీవ్ర గాయం కావడంతో కొప్పళలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాలుడికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు తల్లిదండ్రులు వివరించారు.
విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి
హొసపేటె: నగరంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒక యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. నగరంలోని 100 పడకల ఆస్పత్రికి వెళ్లే మార్గంలో స్థానిక కొత్త హరిప్రియ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో భవనంలో వెల్డింగ్ పనులు చేస్తున్న 18వ వార్డు చప్పరదహళ్లి నివాసి రిజ్వాన్(18) అనే యువకుడు వెల్డింగ్ చేస్తుండగా, అతని చేతిలో ఉన్న ఇనుప పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయమై ఎక్స్‌టెన్షన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకున్నారు. హుడా ఛైర్మన్ హెచ్‌ఎన్‌ఎఫ్ ఇమాం మహ్మద్ నియాజీ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
అన్ని కార్యాలయాల్లో కన్నడ భాషను వాడాలి
బళ్లారిటౌన్: జిల్లాలోని అన్ని శాఖలు, సంఘ సంస్థలు, వాణిజ్య, నిగమ, మండళ్లలో తప్పనిసరిగా కన్నడ భాషలోనే వ్యవహరించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ అధికారులకు సూచించారు. మంగళవారం నూతన జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కన్నడ జాగృతి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కన్నడ భాష అమలుపై జాగృతి సమితి చురుగ్గా పని చేయాలన్నారు. ఎప్పటికప్పుడు తమకు అధికారిక నివేదిక ఇవ్వాలని సూచించారు. నియమాలను ఉల్లంఘించిన సంస్థలు, ఆయా శాఖలపై చర్యలు తీసుకుంటామన్నారు. మహానగర పాలికె పరిధిలోని వివిధ స్థలాల్లో ప్రకటనలు, బ్యానర్లను కన్నడలోనే ఏర్పాటు చేయాలన్నారు. 60 శాతానికి పైగా కన్నడలో స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఉండాలని సూచించారు. పాలికె కమిషనర్ మంజునాథ్, కన్నడ సంస్కృతి శాఖ ఏడీ నాగరాజు, నిష్టిరుద్రప్ప, కన్నడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
రాయచూరు రూరల్: విద్యార్థులకు టెన్నిస్ క్రీడ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని రాయచూరు క్రీడా యువజన సేవా అధికారి వీరేష్ నాయక్ వెల్లడించారు. మంగళవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన టెన్నిస్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు బోధనకు తోడు బోధనేతర అంశాలపై దృష్టి సారించాలన్నారు. బాలుర విభాగంలో వ్యవసాయ కళాశాల, ఎన్‌ఈటీ ఫార్మసీ కళాశాల మొదటి స్థానం పొందగా, బాలికల విభాగంలో వ్యవసాయ కళాశాల, పూర్ణిమ కళాశాలలు రెండో స్థానం గెలుచుకున్నాయి. కళాశాల అధ్యాపకుడు నవీన్ లక్ష్మీనారాయణ, బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, వంశీ, వీరణ్ణలతో పాటు 150 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.
కన్నడ సేవలు అపారం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కన్నడ భాషకు గడినాడులో చేస్తున్న సేవలు అపారమని ప్రధాన అధ్యాపకుడు రమేష్ అరోలి అభిప్రాయ పడ్డారు. బుధవారం ఆకాశవాణి భవనంలో కవిగోష్టిని ప్రారంభించి మాట్లాడారు. కన్నడ భాష సంరక్షణకు కవితల ద్వారా ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు సాగాలన్నారు. గొరవర్, అమరేష్, వెంకటేష్‌లున్నారు.
పావురాన్ని పట్టుకోబోయి బాలుడికి తీవ్ర గాయాలు
పావురాన్ని పట్టుకోబోయి బాలుడికి తీవ్ర గాయాలు


