వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు భారీ ఏర్పాట్లు
బళ్లారి అర్బన్: ఎస్పీ సర్కిల్‌లో వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి సారధ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పలువురు వాల్మీకి ప్రముఖులు మాట్లాడుతూ ఈ నెల 25న బళ్లారి నగరానికి కొత్త వాల్మీకి విగ్రహం విచ్చేయనుందన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు కోటె ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి వాల్మీకి సర్కిల్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విగ్రహానికి వైభవంగా అలంకరణ, వివిధ వాయిద్య, సంగీత, కళా బృందాలతో పూర్ణ కుంభ కలశాలతో 1008 మంది ముత్తైదువులతో భారీగా పూజలు నెరవేర్చనున్నారు. వేలాది మంది పాల్గొనే అవకాశం ఉన్నందున బుధవారం నుంచే సర్కిల్‌లో హోమ, హవన కార్యక్రమాలను జరిపారు. కాగా రాజనహళ్లి వాల్మీకి పీఠాధిపతి ప్రసన్నానందపురి దివ్య సాన్నిధ్యంలో కార్యక్రమం నెరవేరనుంది. కార్యక్రమంలో మంత్రులు సతీష్ జార్కిహోళి, జమీర్ అహ్మద్, మాజీ మంత్రులు బీ.నాగేంద్ర, కేఎం.రాజన్నలతో పాటు ప్రముఖులు డాక్టర్ సయ్యద్ హుసేన్, కంప్లి ఎమ్మెల్యే గణేష్ పాల్గొననున్నారు. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే వాల్మీకి సర్కిల్‌లో అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


