సుభిక్ష దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం
బళ్లారిటౌన్: విద్య అనేది ఒక నిరంతర యాత్ర, అమూల్యమైన సంపద అని, విద్యార్థులు, యువత జ్ఞానాన్ని పెంపొందించుకొని సుభిక్ష దేశ నిర్మాణానికి ముందడుగు వేయాలని రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్ పేర్కొన్నారు. బుధవారం బళ్లారిలోని సిరుగుప్ప రోడ్డులో మౌంట్ యూ క్యాంపస్ కిష్కింధ యూనివర్సిటీలో చేపట్టిన ప్రథమ ఘటికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవాలన్నారు. విద్య కేవలం పదవి కోసం పరిమితం కారాదని, ఒక జ్ఞాన సంపద కావాలన్నారు. నేర్చుకున్న విద్యను దేశ అభివృద్ధి కోసం వినియోగించాలన్నారు. భౌతికంగా పెరగడం కాదు. జీవితంలో మానవతా విలువలను కూడా అలవరుచుకోవాలన్నారు. భారతీయ పరంపర, సంస్కృతి, సాంప్రదాయాలను విడవరాదన్నారు.
సవాల్‌గా మారిన విద్యా సంస్థల స్థాపన
కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి ఎంసీ సుధాకర్ పాల్గొని మాట్లాడుతూ కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో విద్యా సంస్థలను స్థాపించడం సవాల్‌గా మారిందన్నారు. ఇలాంటి సమయంలో యూనివర్సిటీని ప్రారంభించి రెండేళ్లలో ఘటికోత్సవం ప్రారంభించడం శ్లాఘనీయం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29 ప్రైవేట్ యూనివర్సిటీలు పని చేస్తున్నాయన్నారు. యూనివర్సిటీలు కేవలం విద్యార్థుల దాఖలాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా నాణ్యమైన విద్యను ఇవ్వాలన్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వెలికి తీయాలని హితవు పలికారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం చాలా వెనుకబడి ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే కలబుర్గిలో ఓ ప్రైవేట్ యూనివర్సిటీ ఉండగా రెండోది బళ్లారి జిల్లాలో స్థాపించడం అభినందనీయమన్నారు.
మంచి విద్యాభ్యాసానికి అనుకూలం
ఈ యూనివర్సిటీ వల్ల ఈ ప్రాంతంలోని విద్యార్థులకు మంచి విద్యను పొందేందుకు అనుకూలం అయిందన్నారు. కార్యక్రమంలో బళ్లారి సువర్ణగిరి విరక్తమఠం సిద్ధలింగ మహాస్వామికి డాక్టరేట్ పదవి అందించి గౌరవించారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రమాణ పత్రాలు అందజేశారు. బెళగావి ఎంపీ జగదీశ్ శెట్టర్, సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం.నాగరాజు, సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ, టీఈహెచ్‌ఆర్‌డీ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌జేవీ.మహిపాల్, కిష్కింధ యూనివర్సిటీ కులాధిపతి యశ్వంత్ భూపాల్, సహాయక కులాధిపతి వై.జే.పృథ్వీరాజ్, వైస్ ఛాన్సలర్ నాగభూషణ్, యూ.ఈరణ్ణ, నేతలు రాజు, అమరేశయ్య తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్
సుభిక్ష దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం


