
కోలారు: ఆకస్మికంగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ మెడికో ని బలిగొంది. చైన్నె – బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ హైవే కారిడార్‌లో సోమవారం కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం నగరానికి యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు..
వైద్యుడు కృష్ణ జగన్ (24), అనంతపురం నగరంలోని ఇందిరానగరవాసి, తండ్రి పేరు వెంకటేశులు. కృష్ణ జగన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పంలోని పిఈస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ని పూర్తిచేసి ఇంటర్న్‌షిప్‌లో ఉన్నాడు. పనిమీద అనంతపురానికి వెళ్లిన ఆయన మళ్లీ సోమవారం తెల్లవారుజామున కాలేజీకి ఐటెన్ కారును నడుపుతూ బయల్దేరారు.
కారు కోలారు జిల్లా బంగారుపేట తాలూకా సిద్ధనహళ్లి వద్ద చైన్నె – బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలో వెళ్తూ వేగం వల్ల అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఓ టైర్ పేలిపోవడమే కారణమని తెలుస్తోంది. కారు నుజ్జునుజ్జుకాగా డాక్టర్ కృష్ణ ఘటనా స్థలంలోనే మరణించారు. ఉదయం 8:30 సమయంలో దుర్ఘటన జరిగింది. బంగారుపేట పోలీసులు చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.