సాక్షి,బళ్లారి: ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం లభించి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా పేదలు ఇంకా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బళ్లారిలో జరిగిన అఖిల భారత యువజన ఫెడరేషన్ 11వ రాష్ట్ర సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురు చిత్ర పటాలకు నివాళులర్పించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీతోపాటు కమ్యూనిస్టులు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేశారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురు అడుగు జాడల్లో మనందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రశేఖర్ అజాద్, అల్లూరి సీతారామరాజు, బాలగంగాధర తిలక్ లాంటి గొప్ప మహానుభావులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు. అయితే దేశానికి తామే స్వాతంత్య్రం తీసుకువచ్చినట్లు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు గొప్పలకు పోతున్నాయన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్ నేతలు కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుకుంటున్నారన్నారు.
హామీలు అమలులో చంద్రబాబు విఫలం
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అంతో, ఇంతో అమలు చేస్తోందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. హామీలు అమలు చేయకపోతే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. అంతకు ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్,కర్ణాటక సీపీఐ నాయకులు నాగభూషణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు లెనిన్‌బాబు,గోపాల్ పాల్గొన్నారు.
భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురు అడుగుజాడల్లో నడవాలి
ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
స్వాతంత్య్ర పోరాట ఫలాలు పేదలకు అందడం లేదు