హుబ్లీలో సిటీ బస్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

హుబ్లీలో సిటీ బస్‌ దగ్ధం

Dec 7 2023 12:14 AM | Updated on Dec 7 2023 12:14 AM

- - Sakshi

హుబ్లీ: హుబ్లీ– ధార్వాడ మధ్య బీఆర్టీఎస్‌ చిగరి బస్సులో బుధవారం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. ఏపీఎంసీ బస్టాప్‌లో బీఆర్‌టీఎస్‌ బస్సు (నంబర్‌ కేఏ–25/ఎఫ్‌ 3472) ధార్వాడ నుంచి హుబ్లీకి వస్తుండగా బస్సులో పొగలు కనిపించాయి. బస్సు డ్రైవర్‌ హుటాహుటిన బస్సును నిలిపి ప్రయాణికులను కిందకు దింపేశారు. కొన్నిక్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్‌ జాగ్రత్త వల్ల 30 మందికి పైగా ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రత్యేక సిటీ బస్సుల్లో తరచు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నట్లు ప్రయాణికులు ఆరోపించారు. నాసిరకం బస్సులే కారణం కావచ్చని అన్నారు. గత నెలలో ఆర్‌టీసీ బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైన ఘటన బెళగావి జిల్లా చిక్కోడిలో జరిగింది.

లిడ్కర్‌ రాయబారిగా

నటుడు డాలి

శివాజీనగర: లిడ్కర్‌ ఉత్పత్తుల రాయబారిగా ప్రముఖ నటుడు డాలి ధనుంజయ్‌ను నియమించాము, ఆయన ఉచితంగానే ఈ పదవిని అంగీకరించారని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బుధవారం విధానసౌధ ముందు భాగంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. నటుడు డాలి ధనుంజయ్‌ ఇక నుంచి లిడ్కర్‌ చర్మ ఉత్పత్తుల రాయబారి అని సీఎం ప్రకటించారు. ఆయనొక ప్రజాభిమానం కలిగిన నటుడు, సమాజంపై ఆసక్తి కలిగినవారని అన్నారు. లిడ్కర్‌లో 50 వేల మందికి పైగా చర్మకారుల కుటుంబాలు సభ్యత్వం కలిగి ఉన్నాయన్నారు. త్వరలోనే డాలిపై ప్రకటన చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు.

ఏపీఎల్‌ కుటుంబాలకూ ఆరోగ్యసాయం: సీఎం

త్వరలో కొత్త హెల్త్‌ కార్డులు జారీ

బనశంకరి: ఆయుష్మాన్‌ భారత్‌– ఆరోగ్య కర్ణాటక హెల్త్‌ కార్డులకు ఆరోగ్యశాఖ కొత్తరూపునిచ్చినట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఆయన నగరంలో మాట్లాడుతూ నూతన హెల్త్‌ కార్డులను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 5.9 కోట్ల మంది ప్రజలకు కొత్త హెల్త్‌కార్డులను అందించాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఏపీఎల్‌ కుటుంబాలకు సైతం ఈ పథకంలో చేర్చామని, ఆ కుటుంబాలకు రూ.5 లక్షల వైద్యఖర్చుల్లో ప్రభుత్వం రూ.1.5 లక్షల (30 శాతం) వరకూ చెల్లిస్తుందన్నారు. బీపీఎల్‌ రేషన్‌కార్డులు కలిగిన పేద కుటుంబాలవారికి ఏడాదికి రూ.5 లక్షల వరకు చికిత్స వ్యయం అందిస్తుందన్నారు.

ఉగ్రవాదులను సీఎం కలుస్తారా: యత్నాళ్‌

బనశంకరి: ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్‌ మద్దతుదారుడు తన్వీర్‌ పీర్‌ అనే వ్యక్తితో వేదికపై కూర్చున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ ఆరోపించారు. బుధవారం ఎక్స్‌ లో ట్వీట్‌ చేసిన యత్నాళ్‌ , సిద్దరామయ్యతో తన్వీర్‌పీర్‌ దిగిన ఫోటో ను పోస్ట్‌ చేశారు. తన్వీర్‌పీర్‌ పాశ్చాత్య దేశాల ఉగ్రవాదులతో సంబంధం ఉందంటూ మరో ఫోటోను కూడా షేర్‌ చేశారు. సిద్దు, తన్వీర్‌పీర్‌తో గతంలో కూడా అనేక సభలు సమావేశాల్లో వేదికల్లో పాల్గొన్నారని ఆరోపించారు. తన్వీర్‌ పీర్‌ నేపథ్యం సీఎంకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇతనిపై ఎన్‌ఐఏతో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement