● ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటై..
ఆపై అప్పుల పాలై
● పురుగుల మందు తాగిన యువకుడు
● చికిత్స పొందుతూ మృతి
మానకొండూర్: ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడిన యువకుడు అప్పులు చేశాడు. వాటిని తీర్చేదారి లేక పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన పెరుమాండ్ల పవన్ కల్యాణ్ (25) డిగ్రీ పూర్తిచేశాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఆపై అప్పుల పాలయ్యాడు. విషయం ఇంట్లో తెలిసింది. శ్రీఆన్‌లైన్ బెట్టింగులు పెట్టొద్దు బిడ్డాశ్రీ అంటూ నెలక్రితమే తల్లి పద్మ, అన్న పవన్‌కుమార్ నచ్చజెప్పారు. పవన్ కల్యాణ్ చేసిన అప్పు రూ.లక్ష వరకు తీర్చారు. అయిన తీరుమార్చుకోని కల్యాణ్ మళ్లీ ఆన్‌లైన్ బెట్టింగులకు ఆలవాటు పడ్డాడు. అప్పు తీర్చే మార్గం తెలియక ఈ నెల 6న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. శనివారం చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి తల్లి పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ శ్రీలత తెలిపారు.
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● సీఎం సభకు వెళ్లి వస్తుండగా ఘటన
మేడిపల్లి: జగిత్యాల – కోరుట్ల రహదారిపై మండలకేంద్రం సమీపంలో ఆర్టీసీ బస్సు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందుభాగంగా ధ్వంసమైంది. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఖమ్మంలో శుక్రవారం జరిగిన సమావేశానికి పంపించారు. ప్రజలను వారి స్వగ్రామంలో దింపిన డ్రైవర్ స్వామి, కండక్టర్ నరసింహ నిర్మల్ బయల్దేరారు. శనివారం వేకువజామున మండలకేంద్రం శివారుకు చేరుకోగానే బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ గాయపడ్డారు. ఇద్దరిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మేడిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశామన్నారు.


