శంకరపట్నం: గద్దపాక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎంఈవో లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. ఐదుగురు విద్యార్థులు.. 8 మంది ఉపాధ్యాయులు అనే కథనం సాక్షిలో శుక్రవారం ప్రచురితమైంది. స్పందించిన డీఈవో చైతన్య జైన్ గద్దపాక హైస్కూల్‌లో విచారణ చేయాలని ఆదేశాల మేరకు శంకరపట్నం ఎంఈవో పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులున్నారు? ఎంతమంది ఉపాధ్యాయులు వచ్చారని హెచ్‌ఎం రమేశ్‌ను ప్రశ్నించారు. 7, 9, 10 తరగతుల్లో విద్యార్థులు పాఠశాలలో చేరకపోవడంపై ఉపాధ్యాయులందరి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకున్నారు. గ్రామంలో 6 నుంచి 10వతరగతి వరకు 70 మంది విద్యార్థులుంటే.. ఐదుగురే గద్దపాక ప్రభుత్వ పాఠశాలకు వచ్చి మిగతా విద్యార్థులు ఎక్కడికి పోతున్నారని ప్రతీ టీచర్‌తో మాట్లాడారు. 9వతరగతిలో విద్యార్థులేరని సెల్‌ఫోన్‌లో నిమగ్నమయిన టీచర్ వివరణ తీసుకున్నారు. పూర్తి నివేదికను డీఈవోకు అందించనున్నట్లు ఎంఈవో తెలిపారు.


