ఆదర్శ నగరంగా కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ నగరంగా కరీంనగర్‌

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

● కేంద్ర మంత్రి బండి సంజయ్‌

● కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌కార్పొరేషన్‌: రాష్ట్రంలోనే అభివృద్ధిలో కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కేంద్రం నుంచి నగరానికి నిధుల వరద పారిస్తామని చెప్పారు. శుక్రవారం నగరపాలక సంస్థ 38వ డివిజన్‌ లక్ష్మినగర్‌లో రూ.50లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి, 3వ డివిజన్‌ విద్యారణ్యపురిలో రూ.48.5లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. హౌసింగ్‌బోర్డుకాలనీలోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. లక్ష్మినగర్‌లో వేసిన నూతన బోరు బావిని పరిశీలించారు. కాలనీవాసులు సంజయ్‌పై పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమపై విశ్వాసం ఉంచి నగరపాలక సంస్థలో అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ప్రజల విశ్వాసాన్ని కొనసాగిస్తూ వంద రోజుల్లోనే నిధులు తీసుకొచ్చామని తెలిపారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, కార్పొరేటర్లు దేవసాని సరస్వతి, సాదవేణి లావణ్య, బోయినిపల్లి ప్రవీణ్‌రావు, తోట అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాకు అర్చక పోస్టులు

కరీంనగర్‌కల్చరల్‌: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో అర్చకులు, పరిచారకులు, వంట స్వాములు తదితర పోస్టులకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 191 మంది అభ్యర్థులకు నియామక పత్రాలందగా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి పలువురు ఎంపికయ్యారు. వేములవాడ నుంచి శ్రీవైష్ణవ అర్చకులుగా మరింగంటి శ్రీవత్సవాచార్యులు, బూర్గడ్డ నందకుమార్‌ ఎంపికయ్యారు. సిరిసిల్ల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి బీట్రూరి నవీన్‌కుమార్‌ నియమితులయ్యారు. బెజ్జంకి చెందిన శేషం శ్రీవత్సవ యాదగిరిగుట్ట దేవస్థానంలో పరిచారకుడిగా నియామకం పొందారు. కరీంనగర్‌ మార్కెట్‌ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి గోదావరిఖనికి చెందిన గోవర్ధనగిరి గిరిధరాచార్యులు అర్చకుడిగా ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అర్చకులు, పరిచారకులు ప్రభుత్వ నియామకాలు పొందడంపై శ్రీవైష్ణవ సేవాసంఘం ప్రతి నిధులు హర్షం వ్యక్తం చేశారు. పీచర కృష్ణమాచార్యులు, గోవర్ధనగిరి శశిరనాచార్యులు, యా దగిరి ఆచార్యులు, కన్నయ్య, అనంత ఆచార్యులు, వెంకటేశ్వర్లు నూతనంగా నియామక పత్రాలు పొందిన వారిని అభినందించారు.

పాఠశాల విద్యార్థులకు ఏఐ, డిజిటల్‌ పాఠాలు

కరీంనగర్‌సిటీ: అన్న, అక్క మెంటర్షిప్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ అటానమస్‌ కళాశాలకు చెందిన బీకాం, బీబీఏ ఐదో సెమిస్టర్‌ విద్యార్థులు, బీకాం ఆరు, మూడో సెమిస్టర్‌ విద్యార్థులు శుక్రవారం దేశరాజ్‌పల్లి, రామడుగు, నాగిరెడ్డిపల్లి తదితర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏఐ, డిజిటల్‌ లెర్నింగ్‌ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఎస్సారార్‌ ప్రభుత్వ అటానమస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కల్వకుంట రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులను అధునాతన సాంకేతిక ప్రపంచానికి సిద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమన్నారు. మెంటర్షిప్‌ అధికారులు మధు రాజేశ్‌, డాక్టర్‌ మల్లారెడ్డి, ఎం.ఆంజనేయులు, గుర్రం రాజేందర్‌, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.నితిన్‌, టి.రాజయ్య, ఉన్నత విద్య ఐకాస చైర్మన్‌ కడారు సురేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు దీటి పద్మజ, టి.పద్మ, టి.సంపత్‌కుమార్‌, కళాశాల స్టాఫ్‌ క్లబ్‌ సెక్రటరీ ఎం. శ్రీనివాస్‌రెడ్డి, ఐక్యూ ఏసీ సమన్వయకర్త డాక్టర్‌ హర్‌ జ్యోతికౌర్‌, సమన్వయకర్తలు అర్జున్‌, రాజు, మల్లేశం, మారుతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement