● ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 114 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని, లేదా పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జీపీ కార్యదర్శిపై ఫిర్యాదు..
భిక్కనూరు జీపీ కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్‌పై అ దే గ్రామానికి చెందిన అందె నరేందర్ రెడ్డి, మహేంద ర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వేనంబర్– 1017లో ఉన్న స్థలం విషయంలో కామారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా.. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డు నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదుదారులు తెలిపారు. ఈ విషయమై గతవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ స్పందించి షెడ్డు కూల్చివేతకు అధికారులను ఆదేశించారన్నారు. అనుమతి తీసుకోకుండా బోరు వేసినందుకు ఆ బోరును సీజ్ చేయాలని ఆదేశించారని వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాలున్నా జీపీ కార్యదర్శి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తూతూమంత్రంగా షెడ్డుపై ఉన్న టార్పాలిన్‌ను తొలగించి షెడ్డు మొత్తం కూల్చివేసినట్లు ప్రకటించారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శి ఆక్రమణదారులకు సహకరిస్తూ కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై మరోసారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.
భవనానికి స్థలాన్ని కేటాయించాలి
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో బంజారా కమ్యూనిటీ భవన నిర్మాణానికి 10 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు దేవసోత్ రమేష్ నాయక్ సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెల్లకుంట తండా పంచాయతీ ప్రధాన గేటు వద్ద బస్‌స్టాప్ లేకపోవడంతో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగడం లేదని, నిత్యం 100 మంది వరకు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు గోపాల్‌పేట వరకు వెళ్లి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గేటు వద్ద శాశ్వత టీజీఎస్‌ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు స్టాప్‌ను ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో కోరారు.


