నియోజకవర్గాలవారీగా సర్ డిజిటలైజేషన్ వివరాలు..
నూరు శాతం పంపిణీ..
కామారెడ్డి నియోజకవర్గంలో స్లో...
బతుకుదెరువు కోసమో, పిల్లల చదువులు, ఉద్యోగాల కోసమో పట్టణాలకు వలస వెళ్లిన వారిలో చాలా మందికి సొంతూరుతో పాటు తాము ఉంటున్న పట్టణాల్లోనూ ఓటు హక్కు ఉంది. ఊళ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినపుడు అక్కడ పోటీ చేసే వారి అభ్యర్థన మేరకు ఊరికి వెళ్లి ఓటు వేసేవారు. అలాగే మున్సిపల్ ఎన్నికలు వస్తే తాము ఉంటున్న పట్టణాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకునేవారు. అయితే డబుల్ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంతో ఎక్కడోచోట ఓటు హక్కును రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు చోట్ల ఓటు రాయించుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో చాలామంది సొంతూళ్లలో ఓటును కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు.
ఎన్యుమరేషన్ ఫాం అందుకున్నా..
బూత్ లెవల్ ఆఫీసర్లు ఇప్పటికే ఓటర్లకు ఈఎఫ్‌లను అందించారు. డబుల్ ఓట్లు ఉన్నవారు కూడా వీటిని స్వీకరించారు. అయితే రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు ఎన్యుమరేషన్ పత్రాలను నింపి తిరిగి ఇచ్చే విషయంలో వెనకాముందు అవుతున్నారు. పట్టణాల్లో ఉంటున్న చాలామందికి సొంతూరిలో తమకు ఓటు ఉండడంతో అక్కడే ఫాంలు నింపి బీఎల్‌వోలకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పట్టణాల్లో ఓటర్ల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఎంతో ఓపికతో తమ ఈఎఫ్‌లను నింపించి మరీ బూత్ లెవల్ అధికారులకు అప్పగిస్తుండగా, పట్టణాలు కొంత వెనకబడ్డాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలలో ఓటు హక్కు కలిగి ఉన్న గ్రామీణ ప్రాంత ఓటర్లు ఫాంలను తమ సొంత గ్రామాల్లో ఇస్తుండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.
నియోజకవర్గం పోలింగ్ బూత్‌లు మొత్తం ఓటర్లు ఈఎఫ్ పత్రాల డిజిటలైజేషన్ శాతం
పంపిణీ శాతం
జుక్కల్ 255 2,06,343 100 1,32,249 64.09
ఎల్లారెడ్డి 274 2,28,503 100 1,53,195 67.04
కామారెడ్డి 267 2,61,160 100 1,29,975 49.77
మొత్తం 796 6,96,006 100 4,15,419 59.69
ఎన్యుమరేషన్ ఫాం(ఈఎఫ్)లను ప్రతి ఓటరుకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలకు సంబంధించిన సర్ ప్రక్రియ కామారెడ్డి కలెక్టర్ పర్యవేక్షణలో, బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రక్రియ నిజామాబాద్ కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతోంది. కాగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 796 పోలింగ్ బూత్‌ల పరిధిలో 6,96,006 మంది ఓటర్లు ఉండగా.. అందరికీ ఎన్యుమరేషన్ ఫాంలు అందజేశామని అధికారులు తెలిపారు.
జిల్లాలో ఎన్యుమరేషన్ ఫాంల డిజిటలైజేష న్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు 4,15,419 మంది ఓటర్లకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అంటే 59.69 శాతం పూర్తయినట్లు. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో ఓటర్ల ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, కామారెడ్డి కొంత వెనకబడి ఉంది. ఎల్లారెడ్డిలో 2,28,503 మందికిగాను 1,53,195 మంది ఓటర్ల ఈఎఫ్‌లు డిజిటలైజ్ అయ్యాయి. అంటే 67.04 శాతం జరిగింది. జుక్కల్‌లో 2,06,343 ఓటర్లకుగాను 1,32,249 మంది (64.09 శాతం) పత్రాల డిజిటలైజేషన్ పూర్తయ్యింది. కామారెడ్డిలో మాత్రం 2,61,160 మందికిగాను 1,29,975 మంది పత్రాలనే డిజిటలైజ్ చేశారు. అంటే సగం కూడా పూర్తికాలేదు. జిల్లాకేంద్రంలో నివాసం ఉంటున్న చాలామందికి రెండుమూడు ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో వార్డులో రెండు వందల నుంచి మూడు వందల వరకు ఇతర గ్రామాలకు చెందిన వారి ఓట్లు ఉంటాయని అంచనా. వీరిలో ఎక్కువ మంది సొంతూళ్లలో ఎన్యుమరేషన్ పత్రాలను నింపి ఇవ్వడం, డబుల్ ఓట్లు నమోదు చేసుకునే అవకాశాలు లేకపోవడంతో ఓటర్ల సంఖ్య తగ్గిపోవచ్చని భావిస్తున్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఉపాధి కోసమో, పిల్లల చదువుల కోసమో గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చినవారు తమ ఓటు హక్కును స్వగ్రామంలో ఉంచుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. చాలా ఏళ్లుగా పట్టణాల్లో ఉంటున్నవారూ స్వగ్రామానికే ఓటేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
పట్టణాల్లో నివాసముంటున్నా
ఊళ్లోనే ఓటు
మెజారిటీ ఓటర్ల అభిప్రాయమిదే
స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారే
పట్టణాలవైపు మొగ్గు


