విద్యాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి కృషి

Jul 14 2026 6:16 AM | Updated on Jul 14 2026 6:16 AM

విద్యాభివృద్ధికి కృషి

బిచ్కుంద: ‘‘సర్కారు బడిలోనే చదివి ఉన్నత స్థానానికి చేరా. విద్యపై మమకారంతో పాఠశాలల అభివృద్ధికి నా వంతు సాయం చేస్తున్నా.. పాఠశాలల అభివృద్ధికి మరింతగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా’’ అని విల్కో సోర్స్‌ సంస్థ చీప్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీవో) సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సురేశ్‌రెడ్డి, పుల్కల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ హెడ్‌మాస్టర్‌ ఆనంద్‌కుమార్‌ స్నేహితులు. పాఠశాలలో సౌకర్యాలు లేని విషయాన్ని ఆనంద్‌కుమార్‌ తన స్నేహితుడి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన స్పందించి రూ. 21 లక్షల విరాళం అందించారు. ఈ నిధులతో సర్కారు బడిని కార్పొరేట్‌ స్కూల్‌కు దీటుగా తీర్చిదిద్దారు. దీనిని సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సురేశ్‌రెడ్డిని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు..

చిన్ననాటి దోస్త్‌..

పుల్కల్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడైన ఆనంద్‌కుమార్‌ నా చిన్ననాటి మిత్రుడు. ఇద్దరం వరంగల్‌లో ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం. ఆయన ఇక్కడ టాయిలెట్స్‌ లేకపోవడంతో బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నా దృష్టికి తీసుకువచ్చారు. ఇతర సమస్యలను వివరించారు.

యువ అన్‌స్టాపబుల్‌ సంస్థ ద్వారా..

మాకు యువ అన్‌స్టాపబుల్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. దాని ద్వారా ఏటా మూడు పాఠశాలలను ఎంచుకుని వాటి అభివృద్ధికి విరాళాలు అందిస్తున్నాం. మొదట నేను చదువుకున్న వరంగల్‌లోని ప్రభుత్వ పాఠశాలకు రూ. 14 లక్షల విరాళం అందించా. మేం ప్రధానంగా వెనకబడిన ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకుంటాం. యువ సంస్థ సభ్యులు పుల్కల్‌ పాఠశాలను సందర్శించి సమస్యలను గుర్తించి మాకు నివేదిక అందించారు. దీంతో విద్యార్థుల ఇబ్బందులను తీర్చడం కోసం సామాజిక బాధ్యతగా రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చా.

నిధులు సద్వినియోగం..

పుల్కల్‌ పాఠశాల అభివృద్ధి కోసం మేం ఇచ్చిన నిధులను ప్రధానోపాధ్యాయుడు పారదర్శకంగా వినియోగించారు. నిధులను సద్వినియోగం చేసుకుంటూ బడిలో అవసరమైన వసతులు కల్పించారు. కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం.

ఏటా మూడు స్కూళ్లకు విరాళాలు..

సామాజిక బాధ్యతగా

పుల్కల్‌ బడికి నిధులిచ్చా

‘సాక్షి’తో విల్కో సోర్స్‌ సంస్థ సీటీవో

సురేశ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement