● సీఎం రేవంత్‌రెడ్డికి
ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి
● ముప్కాల్ పంప్ హౌజ్ వద్ద
రక్తదానంతో నిరసన
కమ్మర్‌పల్లి: ‘‘నా రక్తం తీసుకోండి.. రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి’’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్ హౌజ్ వద్ద సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రక్తదానం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా రక్తదానం చేశారు. బాల్కొండ రైతులనుంచి సేకరించిన రక్తం, వినతిపత్రాలను ఎస్సారెస్పీ అధికారులకు అందజేసి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులపై ప్రశ్నించిన మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి ‘వాళ్ల రక్తం చల్లితే పంటలు పండుతాయి’ అని రాక్షసంగా సమాధానమిచ్చారన్నారు. అందుకే తనతోపాటు బాల్కొండ రైతులు రక్తాన్ని ఇస్తున్నారని, ఇప్పుడు అయినా పంటలను కాపాడేందుకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గోదావరిలో కాళేశ్వరం వద్ద రోజుకు 10 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోందని, వెంటనే కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లను ప్రారంభించి ఆ నీటిని ఎల్లంపల్లికి తీసుకువచ్చి అక్కడ నుండి వరద కాలువలోకి ఎత్తిపోయాలన్నారు. వరద కాలువపై నిర్మించిన రాంపూర్, రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంప్ హౌజ్‌లు సురక్షితంగా, రివర్స్ పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని, వాటి ద్వారా నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో కాళేశ్వరం జలాలను పోయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో సుమారు 15 టీఎంసీల నీరుందని, నిజామాబాద్ జిల్లా రైతుల అవసరాల కోసం వెంటనే 4 టీఎంసీలను విడుదల చేయాలని కోరారు. ఈ నీటితో 15 రోజులపాటు పంటలను కాపాడుకోవచ్చని, ఈలోపు కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ఎస్సారెస్పీని తిరిగి నింపాలని సూచించారు. ఈనెల 15న జరిగే స్కివమ్ సమావేశంలో రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.


