● అల్బెండజోల్ మాత్రలు వేయించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేసి నులిపురుగుల నిర్మూలనకు కృషి చేద్దామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నుంచి 19 ఏళ్ల వయస్సు గల పిల్లలందరికీ ఏడాదికి రెండుసార్లు అల్బెండజోల్ మాత్రలు వేయించాలని సూచించారు. లేకపోతే పిల్లలలో రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక ఎదుగుదల మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడంలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో 2,46,177 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు అందేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. సోమవారం మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు ఈనెల 20 న నిర్వహించే మాప్‌అప్ డేన తప్పనిసరిగా మాత్రలు అందచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, కౌన్సిలర్ అఖిల, డీఈవో మల్లికార్జున్, డీఎంహెచ్‌వో వెంకట్, ప్రోగ్రాం అధికారి రోహిత్ కుమార్, కమిషనర్ పర్వతాలు, వైద్యురాలు చందన ప్రియ, ఎంఈవో ఎల్లయ్య, పాఠశాల హెచ్‌ఎం మాధవి తదితరులు పాల్గొన్నారు.


