లేబర్‌ చట్టాలు తుంగలో తొక్కి.. | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ చట్టాలు తుంగలో తొక్కి..

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

కాకినాడ క్రైం: ‘‘వాళ్లకేముంది.. రూ.లక్షల్లో వేతనం. భద్రతతో కూడిన రెగ్యులర్‌ ఉద్యోగం, సమాజంలో గౌరవ మర్యాదలు, సకాలంలో జీతాలు, అదనంగా ఒకటా రెండా ఎన్నో ప్రయోజనాలు. 16 ఏళ్లుగా కేవలం రూ.5 వేల జీతాలకు పనిచేస్తున్న మా లాంటి దీనుల బాధ వారికేం తెలుస్తుంది. వాళ్లలాగే డిగ్రీలు చదువుకున్నాం, తలరాతలు బాగోక వారి కింద పని చేస్తున్నాం. వారి ఆధిపత్యాన్ని చూపడానికి మా కడుపులే కొట్టాలా..’’ ఇదీ కాకినాడ జీజీహెచ్‌లో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో దశాబ్దంన్నరగా కేవలం రూ.5 వేలు జీతానికి పనిచేసి ఉద్వాసనకు గురైన ఉద్యోగుల మనోగతం.

కాకినాడ జీజీహెచ్‌ ఓపీ విభాగంలో 22 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈఓ)లుగా పనిచేస్తున్నారు. వీరు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ చీటీలు జారీ చేస్తారు. వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. అలాంటి కీలక విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో వారంతా పని చేస్తున్నారు. 16 ఏళ్ల నుంచి రెండేళ్ల మధ్య అనుభవంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 10 నుంచి డిగ్రీ వరకు చదివిన వారున్నారు. తమ ఉద్యోగాలకు ఎప్పటికై నా ప్రాధాన్యం దక్కకపోదా, జీతాలు పెరగవా, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కాస్తా కనీసం కాంట్రాక్టు ఉద్యోగమైనా కాకపోదా అని ఎదురు చూస్తున్నారు. కనీసం పీఎఫ్‌, ఈఎస్‌ఐలు కూడా లేకుండానే ఇన్నేళ్లు కేవలం రూ.5 వేల జీతానికి పని చేశారు. ఆసుపత్రి అవసరం తీరడానికి అధికారులు సైతం వీరిని వాడుకున్నారు. వీరే లేకపోతే ఓపీ విభాగాన్ని నిర్వహించేందుకు ఇబ్బంది వచ్చేది.

కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించి..

ఆసుపత్రి అధికారుల నిర్ణయంతో లబోదిబోమంటూ ఉద్యోగులంతా కలెక్టర్‌ హరేంధర్‌ ప్రసాద్‌ను ఆశ్రయించారు. 16 ఏళ్లుగా కేవలం రూ.5 వేల జీతంతో పనిచేస్తున్న తమకు ఆ ఉద్యోగం కూడా ఊడే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికే తమలో ఆరుగురిని తొలగిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లావణ్యకుమారి ఆదేశాలతో అడ్మినిస్ట్రేటర్‌ శ్రీధర్‌ ఉత్తర్వులు ఇచ్చారని వాపోయారు. స్పందించిన కలెక్టర్‌ ఆసుపత్రి అధికారులను పిలిపించి వివరణ కోరగా, టెండర్‌లో నియమావళి దాచి తప్పుదోవ పట్టించారని ఉద్యోగులు అంటున్నారు. టెండర్‌ రూల్స్‌ జారీ చేసినప్పుడు ఇన్నేళ్లుగా పనిచేసిన మా అర్హత, సమర్థతలు గుర్తురాలేదా అని అధికారులను డీఈఓలు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగాలు అమ్ముకోవడానికేనా?

అర్హత, అనుభవంతో కొనసాగించాల్సిన ఉద్యోగాలను అమ్ముకునేందుకే కుటిల యత్నం చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆరుగురిని తొలగించి, ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారన్నారు. ఒక్కో ఉద్యోగం రూ.2 లక్షలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. దీనికి అధికారులు మద్దతు, భాగస్వామ్యమో తేలాలని సిబ్బంది డిమాండ్‌ చేశారు.

ఫ ఊడిగం చేయించుకుని ఉద్వాసన

ఫ జీజీహెచ్‌లో డీఈఓల పరిస్థితి

ఫ 16 ఏళ్లు ఉద్యోగం చేసినా,

రూ.5 వేలే జీతం

ఫ ఇప్పుడేమో విధుల నుంచి తొలగింపు

ఆసుపత్రి అధికారులు ఇన్నేళ్లుగా లేబర్‌ చట్టాలు తుంగలో తొక్కి తమను వినియోగించుకున్నారని డీఈఓలు అంటున్నారు. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం, కాంట్రాక్టు లేబర్‌ యాక్ట్‌ 1970, ఏపీ గవర్నమెంట్‌ అవుట్‌ సోర్సింగ్‌ రెమ్యూనరేషన్‌ రేట్‌ను అనుసరించి కనీస వేతనం నెలకి రూ.13,772 ఇవ్వాల్సి ఉంది. అయితే ఇన్నేళ్లుగా అందులో సగం కూడా ఇవ్వకుండా దారుణమైన శ్రమ దోపిడీకి పాల్పడి 22 మంది ఉద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టేశారు.

టెండర్‌ రూల్స్‌ వదిలేసి..

సుమారు 16 ఏళ్ల క్రితం ఓ సంస్థ వీరిని నియమించుకుంది. అప్పటి నుంచి రూ. 5 వేల జీతంతోనే కొనసాగుతున్నారు. తాజాగా అన్నవరం దేవస్థానం సహా అనేకచోట్ల వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన కనకదుర్గ మ్యాన్‌పవర్‌ సప్లయర్స్‌ సంస్థకు డీఈఓల కాంట్రాక్టు మే నెలలో ఇచ్చారు. టెండర్‌ పిలిచినప్పుడే ఆసుపత్రి అధికారులు నియామక నియమావళితో టెండర్‌ డాక్యుమెంట్‌ విడుదల చేశారు. అందులో ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగిస్తూ అదనంగా నియమించుకునే ఏ ఉద్యోగికై నా డిగ్రీ అర్హత తప్పనిసరి అని పేర్కొన్నారు. తీరా కాంట్రాక్టు వచ్చిన తర్వాత అనుమానాస్పద రీతిలో టెండర్‌ డాక్యుమెంట్‌లోని నియమావళిని రాసిన వారే తుంగలో తొక్కేశారు. ఈ వ్యవహారమే ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. ఇన్నేళ్లుగా వెట్టిచాకిరీ చేసిన వారి ఉద్వాసనకు జీజీహెచ్‌ అధికారులు సిద్ధమయ్యారు. డిగ్రీ లోపు విద్యార్హత ఉన్నవారి అందరినీ, వారి అనుభవం, అందించిన సేవలను కూడా కనీసం పరిగణించకుండా నిర్థాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement