బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): విద్యుత్, డీజిల్, పెట్రోల్ వంటి ఎటువంటి ఇంధన అవసరం లేకుండా, కేవలం నీటి ప్రవాహ శక్తి (యాంత్రిక శక్తి) ఆధారంగా దిగువ ప్రాంతాల నుంచి ఎగువకు నీటిని ఎత్తిపోసే వినూత్న ‘హైడ్రో లిఫ్ట్‘ యంత్రాన్ని ఆవిష్కరించడంలో పెదపూడి మండలం కై కవోలు గ్రామానికి చెందిన రైతు పంపన శ్రీనివాస్ కృషి ఎనలేనిదని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రశంసించారు. ఈ మేరకు సోమవారం స్థానిక పీజీఆర్‌ఎస్ హాలులో జాతీయ గుర్తింపు అవార్డు పత్రాన్ని శ్రీనివాస్‌కు అందించి అభినందనలు తెలిపారు. వాగులు, చెక్ డ్యామ్‌ల వద్ద నీటి ఉధృతికి ఇనుప టర్బైన్లు తిరుగుతాయని, గేర్ బాక్సుల సహాయంతో ఈ యాంత్రిక శక్తి ద్వారా పంపులు పనిచేసి, నీటిని ఎగువ ప్రాంతాలకు పంప్ చేస్తాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ హైడ్రో లిఫ్ట్ 24 గంటల ప్రాతిపదికన పనిచేస్తూ, రోజుకు దాదాపు 25 లక్షల లీటర్ల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఐటీఐ ఫిట్టర్ కోర్సు పూర్తి చేసిన పంపన శ్రీనివాస్, కొండ ప్రాంతాల్లో సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూసి దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి ఈ ప్రాజెక్ట్ నమూనాను సిద్ధం చేశారన్నారు. కేఎల్ విశ్వవిద్యాలయం అటల్ ఇన్నోవేషన్ మిషన్ అందించిన రూ.5 లక్షల ఆర్థిక సాయంతో వేట్లపాలెం చెక్ డ్యామ్ వద్ద ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారన్నారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 26 మంది గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లలో ఒకరిగా నిలిచి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకోవడం జిల్లాకే గర్వకారణమన్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ‘బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్‘ పురస్కారాన్ని స్వీకరించారన్నారు. థాయిలాండ్ (బ్యాంకాక్)లో 30 దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రశంసా పత్రాలు, మెడల్స్ సాధించారన్నారు. జాతీయ అవార్డు గ్రహీత పంపన శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం 30 అడుగుల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోసే ఈ యంత్రాన్ని, భవిష్యత్తులో 100 అడుగుల ఎత్తు వరకు పనిచేసేలా, దీని ద్వారా 10 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా నవీకరిస్తున్నానన్నారు. పేటెంట్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెస్తానన్నారు.
‘హైడ్రో లిఫ్ట్’ ఆవిష్కరణకు జాతీయ స్థాయి గుర్తింపు


