ఖతర్నాక్‌ ఖాన్‌.. | - | Sakshi
Sakshi News home page

ఖతర్నాక్‌ ఖాన్‌..

Aug 26 2026 12:12 AM | Updated on Aug 26 2026 12:12 AM

సాధిక్‌ ఖాన్‌ కేసులో ఎన్ని ట్విస్టులో

ట్రాప్‌ నుంచి పరారీ వరకు

అంతా పకడ్బందీగా

మరికొందరు మహిళలతోనూ

ఇదే తరహా ప్రవర్తన

కోడలి వ్యవహారశైలిపై

అనుమానాస్పదంగా

జగదీశ్వర్‌రెడ్డి కుటుంబసభ్యులు

కాకినాడ క్రైం: సౌజన్యను సాధిక్‌ ఖాన్‌ ట్రాప్‌ చేసి తన దారిలోకి తెచ్చుకుంది మొదలు, ఓ క్రైం థ్రిల్లర్‌ని తలపించేలా తన రాచకార్యాల్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించాడు. తన దారిలోకి తెచ్చుకోవడం, ఆమైపె ఇష్టాన్ని వ్యక్తం చేయడం, అక్రమ బంధాన్ని కొనసాగించడం, ఆమె భర్తను అడ్డు తొలగించుకునేందుకు కుయుక్తులు పన్నడం, ఆస్తి కాజేసేందుకు చేసిన కుట్ర, అంతకుముందు ఆమెను కొట్టడం, భర్తపై దాడి, బాధితురాలి కుటుంబసభ్యుల పైనా విరుచుకుపడడం, వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడం ఇవేవీ థ్రిల్లర్‌కు తీసిపోని రీతిలో ఉన్నాయి. ఆత్మహత్య ఘటన తర్వాత తప్పించుకోవడానికి చేసిన విఫలయత్నాలు ఈ కోవకే చెంది పోలీసుల మతులనే పోగొట్టాయి. సౌజన్య లాంటి మరికొందరు సాధిక్‌ ఖాతాలో ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పిల్లల్ని అడ్డుపెట్టుకొని తల్లులకు వల వేసేవాడని వారి ప్రాఽథమిక విచారణలో తేలింది.

ఆ ఒక్క క్లూతోనే...

కేవలం ఒక్క క్లూతోనే సాధిక్‌ జాడ బట్టబయలైందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలు జరగడం, వాటికి తానే కారణం కావడంతో ఎవరూ అతడిపై ఆరోపణలు చేయకుండానే జాగ్రత్తపడి పరారయ్యాడు. అప్పటికి లేఖ దొరకలేదు, సాధిక్‌ ఖాన్‌ అనే వ్యక్తి పేరు కూడా ఎవరికీ తెలియదు. ఆ సమయంలో తాను వినియోగిస్తున్న ఒక్కొక్కటి రూ.1.5 లక్షలు విలువ చేసే రెండు ఖరీదైన ఫోన్లు వదిలేసి పరారయ్యాడు. వెళుతూ రైఫిల్‌ అసోసియేషన్‌లో ఉన్న ఓ ఆప్తమిత్రుడికి ఫోన్‌ చేసి ఆ నంబర్‌ డిలీట్‌ చేసేశాడు. కొందరి ఫోన్‌ నంబర్లు పాకెట్‌ బుక్‌లో రాసుకొని బయల్దేరాడు. కాల్‌ రికార్డ్స్‌ డేటాలో ఆ కాల్‌ జాడ లభ్యమైంది. ఇంటి నుంచి నేరుగా ద్విచక్రవాహనంపై సామర్లకోటకు వెళ్లిన సాధిక్‌ బైక్‌ను పార్కింగ్‌లో ఉంచి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. పలువురి ప్రయాణికుల ఫోన్లతో తనకు కావలసిన వారికి ఫోన్లు చేశాడు. చివరికి మహారాష్ట్రకు వెళ్లి తన స్నేహితుడిని కలిశాడు. అక్కడ ఒక రోజు ఉన్నాడు. తర్వాత రోజు మీరట్‌కి బయల్దేరాడు. సరిగ్గా అదే సమయానికి కాకినాడ పోలీసులు సదరు మిత్రుడ్ని చేరారు, కొద్ది సేపటి ముందు సాధిక్‌ మీరట్‌కు అబ్బాస్‌ అనే మరో రైఫిల్‌ ట్రైనర్‌ను కలిసేందుకు వెళ్లాడని సమాచారం అందించాడు. అతడి కంటే ముందు అబ్బాస్‌ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు సాధిక్‌ అబ్బాస్‌ ఇంటి వద్దకు సమీపిస్తుండగా పట్టుకున్నారు. అక్కడి నుంచి కేరళ వెళ్లాలని అనుకున్నాడని పోలీసులు తెలిపారు.

కోడలిపై అనుమానం..

కోడలి వ్యవహారశైలి ఆది నుంచీ అనుమానాస్పదంగానే తోచిందని సాధిక్‌ ఖాన్‌ చేతిలో హత్యకు గురయ్యాడని భావిస్తున్న జగదీశ్వర్‌రెడ్డి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అనూహ్య రీతిలో ఏ కారణం లేకుండానే జగదీష్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని వాపోయారు. ఏడాది పాటు వాంతులు అయ్యాయని, కారణం తెలిసేది కాదని చెప్పుకొచ్చారు. మాట నెమ్మదించి, కాలు కూడా చచ్చుబడిందని అన్నారు. జీర్ణకోశ సమస్యతో బాధపడుతూ కాకినాడ సర్పవరంలో ఉన్న ఓ ఆసుపత్రిలో ఐదు రోజులు చికిత్స అనంతరం జగదీష్‌ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ ఆసుపత్రి ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి వెళ్లి చికిత్స పొందినట్టు చెప్పారు. అక్కడ కాస్త కోలుకోగా, హైటెక్‌ సిటీలో ఉన్న ఓ ఫిజియోథెరపీ సెంటర్‌కు సౌజన్యతో పాటు ఆమె తల్లిదండ్రులు, అత్త, మామ తీసుకువెళ్లి చేర్చారు. కేవలం ఫిజియోథెరపీ చేస్తే చాలు కోలుకోవలసిన దశలో జగదీశ్వర్‌రెడ్డి హఠాత్తుగా మరణించాడు. ఫిజియోథెరపీ చేస్తుండగా తన భర్త స్పందించడం లేదని కోడలు సమాచారం ఇచ్చిందని జగదీశ్వర్‌రెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు. సౌజన్య ప్రవర్తన తీవ్ర అనుమానాలకు తావిచ్చిందని తెలిపారు. ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి తాను మాత్రమే ఉంటానని అందరూ వెళ్లిపోవాలని చెప్పేదన్నారు. చనిపోయే కొద్దిసేపటి ముందు కూడా తమను హోటల్‌ గదికి పంపేసిందని, తానే చూసుకుంటానని చెప్పిందని అంటున్నారు. సాధిక్‌ ఖాన్‌ ఆ సమయంలో వచ్చి సౌజన్యతో కలిసి జగదీష్‌ తాగే ప్రొటీన్‌ షేక్‌లో అంతకుముందు పట్టించిన స్లో పాయిజన్‌ గుణాలున్న రసాయనాన్ని మరోమారు కలిపి ఉంటాడని అనుమానిస్తున్నామని కుటుంబీకులు తెలిపారు.

పిల్లలు ఎర.. తల్లులు సొర

ఖతర్నాక్‌ ఖాన్‌ వ్యవహార శైలిని తమ పిల్లల్ని కోచింగ్‌లో చేర్చిన పలువురు తల్లులు పూసగుచ్చినట్టు తమను సంప్రదించిన మీడియాకు తెలిపారు. పిల్లల్ని అడ్డుపెట్టుకొని తమతో మాటకలిపేందుకు యత్నించేవాడని, తమ స్టేటస్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగాం పేజీలు ఫాలో అవుతూ లైక్స్‌ కొడుతూ ముగ్గులోకి దించేందుకు యత్నించేవాడన్నారు. ఈ కారణంతోనే తమ పిల్లల్ని అతడి అకాడమీలో మానిపించేశామని కొందరు చెప్పారు. క్లాస్‌ ఇన్‌ఫర్మేషన్‌ కోసం అంటూ కాల్స్‌ చేసి అక్కర్లేని విషయాలతో మాటలు పెంచేవాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement