కలెక్టర్ ఆదేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గోదావరి పుష్కరాలను భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పటిష్ట ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. జిల్లా పరిధిలోని గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ప్రధాన ఘాట్లను గుర్తించి, భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులనూ ముందుగానే సమకూర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గోదావరి తీర ప్రాంతాల్లో ఐదు ప్రధాన ఘాట్లను అన్ని వసతులతో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. గోదావరి కాలువల వెంబడి జిల్లాలోని 9 మండలాల్లో 82 సీ–కేటగిరీ ఘాట్లను గుర్తించినట్టు తెలిపారు. ఆయా ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలు, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, మరుగు దొడ్లు, పార్కింగ్, రహదారి సౌకర్యాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో డాక్టర్ డి.తిప్పే నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగాలు తొలగించం
జీజీహెచ్ డీఈవోలకు కలెక్టర్ భరోసా
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో 16 ఏళ్లుగా కేవలం రూ.5 వేలు నెలసరి వేతనానికి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ల (డీఈవో)లలో కొందరిని ఉన్నపళంగా ఆసుపత్రి అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ అన్యాయంపై ‘సాక్షి’ దినపత్రిక మంగళవారం ‘ఐదు వేలాకోలం’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీనిపై జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పందించారు. ఆసుపత్రి అధికారుల నుంచి వివరణ కోరినట్టు తెలిపారు. డీఈవోలలో ఏ ఒక్కరినీ తొలగించకుండా అక్కడే కొనసాగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పనిచేస్తున్నవారి వరకు విద్యార్హతలకు మినహాయింపునిచ్చి, అనుభవాన్నే ప్రాతిపదికగా తీసుకొని, యథాస్థానంలో కొనసాగిస్తామని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.
రేపే నిధి ఆప్ కే నికత్
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో గురువారం ఉదయం 9 గంటలకు నిధి ఆప్ కే నికత్ డిస్ట్రిక్ట్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ ఎంకే వెంకటరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధికి సంబంధించి పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని పతంజలి ఫుడ్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి యానాంలోని నల్లం ఎడ్యుకేషనల్ సొసైటీలోను, కాకినాడ జిల్లాకు తుని మార్కండ్రాజుపేట అర్కా ఎడ్యుకేషనల్ సొసైటీలోను, పశ్చిమ గోదావరి జిల్లాకు కాళ్ల మండలం సీసలి జయలక్ష్మి సీఫుడ్స్‌లోను, ఏలూరు జిల్లాకు వట్లూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోను ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. కొత్త ఈపీఎస్, ఈడీఎల్‌ఐ, ఆమ్నెస్టీ, ఈఈసీ, కొత్త సీఐటీఈఎస్ పథకాల అమలు నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఆయా సంస్థలు దీనిని ఉపయోగించుకోవాలన్నారు. నిధి ఆప్ కే నికత్ అని పేర్కొంటూ ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వవచ్చని వెంకటరావు తెలిపారు.
‘నీట్ పీజీ’ పరీక్షకు
పటిష్ట ఏర్పాట్లు : కలెక్టర్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జాతీయ స్థాయిలో ఈ నెల 30న జరగనున్న నీట్ పీజీ (జాతీయ అర్హత) పరీక్షను జిల్లాలో అత్యంత ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నీట్ పరీక్షపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే నీట్ పీజీ జాతీయ అర్హత పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణ, గట్టి పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో తిప్పేనాయక్ పాల్గొన్నారు.


