బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): డీసీసీబీ ఇన్‌చార్జి సీఈవోగా సలాది సురేంద్రబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 15న ‘డీసీసీబీకి దిక్కెవరు?’ శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఆప్కాబ్ అధికారులు, డీసీసీబీ చైర్మన్ స్పందించారు. అమరావతిలోని ఆప్కాబ్ డీజీఎం పనిచేస్తున్న సురేంద్రబాబును ఇన్‌చార్జి సీఈ వోగా నియమించారు. ప్రస్తు తం ఇన్‌చార్జి సీఈవోగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్, డీజీఎం గా పనిచేస్తున్న శ్రీధర్ చౌదరి సెలవుపై వెళ్లడంతో బ్యాంకు కార్యకలాపాలకు ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో అప్కాబ్ అధికారులను ఇక్కడ నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సురేంద్రబాబు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
జవాబుదారీతనంతో
పనిచేయాలి : కలెక్టర్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జాబితాల రూపకల్పనకు చిత్తశుద్ధి, అంకితభావం, జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్‌లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మండలాల వారీగా వివిధ అంశాల పురోగతిని, పెండింగ్ అంశాలను సమీక్షించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో భూ రీ–సర్వే, రెవెన్యూ క్లినిక్‌లు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ అంశాలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.


