సర్టిఫికెట్లు ఇప్పించండి సారూ.. | - | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్లు ఇప్పించండి సారూ..

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

ప్రభుత్వ పథకాలు అందడం లేదు

మా రేషన్‌ కార్డుకు వేరే వ్యక్తి మ్యాపింగ్‌ చేయడంతో మాకు ప్రభుత్వ పథకాలు ఏమీ అందడం లేదు. మార్చాలని కోరుతూ అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయినా పరిష్కారం లభించడం లేదు. రెండేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాను.

– చిక్కాల నారాయణమ్మ,

వీరవరం, కిర్లంపూడి మండలం

అధికారులు పట్టించుకోవడం లేదు

మా గ్రామంలో నాకు 1.25 ఎకరాల భూమి ఉంది. కానీ ప్రస్తుతం ఎకరం మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదైంది. మిగిలిన 25 సెంట్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. సర్వే చేయాలని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మూడు సార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాను. రెండు నెలలుగా తిరుగుతున్న అధికారులు స్పందించడం లేదు.

– దడాల పాము రాజు,

కోదాడ, తొండంగి మండలం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ) / తుని రూరల్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించాలని పీజీ విద్యార్థులు జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చారు. తుని మండలం వి.కొత్తూరులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో 2024–26 విద్యా సంవత్సరంలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.60 వేల ఫీజుకు గాను ప్రభుత్వం రూ.48 వేలు కళాశాల ఖాతాకు జమ చేసిందని, మిగిలిన డబ్బు విద్యార్థులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులే ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారని, అటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులను ప్రభుత్వం, ప్రభుత్వ కళాశాల యాజమాన్యం ఇబ్బందులకు గురిచేయడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.గంగాసూరిబాబు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరుతో నాక్‌ బీ గ్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉన్న ఈ ప్రభుత్వ కళాశాల నాక్‌ గుర్తింపును కోల్పోయిందన్నారు. సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 324 అర్జీలను పీజీఆర్‌ఎస్‌లో సమర్పించారు. జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు నెలల తరబడి అందించిన అర్జీలకు పరిష్కారం లభించకపోవడంతో మళ్లీ మళ్లీ వచ్చి దరఖాస్తులు సమర్పించాల్సి వస్తోందని వాపోయారు.

పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు పీజీ విద్యార్థుల వినతి

రెండేళ్లుగా తిరుగుతున్నాను

మా గ్రామంలో నాకు 1.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సర్వే చేయడంతో కేవలం ఎకరా మాత్రమే చూపిస్తోంది. మిగిలిన 50 సెంట్ల భూమి ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు గత రెండేళ్లుగా దరఖాస్తు సమర్పిస్తూనే ఉన్నాను. అయినా పరిష్కారం లభించడం లేదు. స్థానిక సర్వేయర్‌ డబ్బులు ఇవ్వకుండా ఏ పనీ చేయడం లేదు.

– పి.స్వామి, తాటిపర్తి, గొల్లప్రోలు మండలం

మా భూమి ఆక్రమించుకున్నారు

మా సమీప బంధువులు నా భూమిని ఆక్రమించుకొని ఇవ్వటం లేదు. నాకు ఉన్నదే 50 సెంట్ల భూమి. ప్రస్తుతం దానికి ఎటువంటి శిస్తూ చెల్లించడం లేదు. నా భూమి నాకు ఇవ్వమన్నా ఇవ్వడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాను. వేరే వ్యక్తి తోడు లేనిదే ఇల్లు కదలలేని పరిస్థితి నాది. అయినా అధికారులు కనికరించడం లేదు.

– డొంక నారాయణమ్మ, రౌతులపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement