పురపోరుకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

పురపోరుకు సన్నాహాలు

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

పెద్దాపురం మున్సిపాలిటీలో ఆర్డీ సమీక్ష

పెద్దాపురం : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నట్టు పురపాలక సంఘ రీజనల్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగ నరసింహారావు తెలిపారు. పెద్దాపురం పురపాలక సంఘంలో ఓటర్ల జాబితా వార్డు మ్యాపింగ్‌ ప్రక్రియను సోమవారం ఆయన పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఓటర్ల జాబితాల మ్యాపింగ్‌ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి, బీఎల్‌ఓలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన రీజియన్‌ పరిధిలో 34 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లు ఉన్నాయని చెప్పారు. 2026 జనవరి ఓటర్ల జాబితా ప్రకారం మ్యాపింగ్‌ జరుగుతుందని తెలిపారు. 18 మున్సిపాలిటీల్లో ఎన్నికల సంబంధించి ఎలాంటి వివాదాలూ లేవన్నారు. 9 స్థానిక సంస్థలకు సంబందించి గ్రామ పంచాయతీల విలీనంపై కోర్టు కేసులు ఉన్నాయని, వాటిలో ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణ కష్టమని చెప్పారు. మరో ఏడు స్థానిక సంస్థలకు సంబంధించి వార్డుల పునర్విభజన అంశంలో కోర్డు కేసులు ఉన్నాయన్నారు. రెండు మూడు రోజుల్లో అవి పరిష్కారమైతే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంతో చేపడతామని చెప్పారు. సెప్టెంబర్‌ మూడో తేదీన ప్రతి పోలింగు బూత్‌ వద్ద మ్యాపింగ్‌తో కూడిన ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. వాటిపై అభ్యంతరాలు కూడా స్వీకరిస్తామని చెప్పారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ పారదర్శకంగా జరిగేలా ఎన్నికల సిబ్బందికి తర్ఫీదు ఇస్తామన్నారు. మ్యాపింగ్‌ ప్రక్రియ అనంతరం ఎన్నికల కమిషనర్‌ ఆదేశాల మేరకు వార్డుల వారీగా ఇంటింటా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement