దేవరపల్లి: పొగాకు పంట నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకుంది. అనుమతించిన దానికంటే ఎక్కువ పండిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఏడాది పొగాకు మార్కెట్‌లో ఏర్పడిన సంక్షోభం, అధిక ఉత్పత్తి, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. 2026–27 పంట కాలానికి రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాల పరిధిలో ఉత్పత్తిని 81 మిలియన్ల కిలోలకు కుదించింది. తద్వారా బ్యారన్‌కు 20 క్వింటాళ్లు మాత్రమే పండించాల్సి ఉంది. ఈ మేరకు త్వరలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి.
వేలం కేంద్రాలు
టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలు, ఎస్‌ఎల్‌ఎస్ ఒంగోలు రీజియన్ పరిధిలోని పొదిలి–1, కనిగిరి, కందుకూరు–1, 2, కలిగిరి, డీసీ పల్లి కేంద్రాలు, ఎస్‌బీఎస్ రీజియన్ పరిధిలోని వెల్లంపల్లి–2, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొడపి వేలం కేంద్రాల పరిధిలో రైతులు పొగాకు పండిస్తున్నారు. అయితే 2025–26 పంట కాలంలో రాష్ట్రంలో 142 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. దీనిలో 50.87 మిలియన్ల కిలోలు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల రైతులకు అనుమతి ఉంది. మిగిలిన 92 మిలియన్ల కిలోలను 11 ఎస్‌బీఎస్, ఎస్‌ఎల్‌ఎస్ వేలం కేంద్రాలకు అనుమతి ఇచ్చింది. గత రెండేళ్లు పొగాకు సాగు లాభసాటిగా ఉండడంతో రైతులు అత్యాశకు పోయి అధిక విస్తీర్ణంలో పంట వేశారు. దీంతో 230 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగినట్టు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే సుమారు 88 మిలియన్ల కిలోలు పంట అదనంగా పండింది.
యుద్ధ ప్రభావం
అధిక ఉత్పత్తి, పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం, జింబాబ్వే, టాంజానియా వంటి దేశాల్లో పొగాకు ఉత్పత్తి అధికంగా పెరగడం వంటి కారణాలతో ఈ ఏడాది అంతర్జాతీయంగా పొగాకుకు డిమాండ్ తగ్గింది. మనం పండించిన పొగాకులో 70 శాతం ఎగుమతి జరుగుతుండగా, 30 శాతం మాత్రమే దేశంలో వినియోగిస్తారు. యుద్ధ ప్రభావంతో పొగాకు ఎగుమతి ఆర్డర్లు ఇంత వరకు ఖరారు కాకపోవడంతో మార్కెట్లో కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి. రాష్ట్రంలో 230 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి కాగా, ఇప్పటి వరకు సుమారు 26 మిలియన్ల కిలోలు కొనుగోలు చేశారు. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతుల ఇళ్ల వద్ద ఎక్కడ బేళ్లు అక్కడే ఉండిపోయాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి కొత్త పంట సాగు ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితి గత 52 ఏళ్లలో ఎప్పుడూ లేదని రైతులు చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగినందున బ్యారన్‌కు 30 క్వింటాళ్ల ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.


