● కామన్నగారి పాకలు ప్రజల కన్నీటి గాథ
● అంతిమ యాత్రకు అష్టకష్టాలు
● కాలగర్భంలో కలసిపోయిన
శ్మశాన వాటిక
మనిషి పుట్టుకను దేవుడు నిర్ణయిస్తాడేమో కానీ, మరణం తరువాత ఆ మనిషికి ఆరడుగుల నేల కూడా దక్కకపోతే అది సమాజ వైఫల్యమే. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా.. చివరి
మజిలీకి స్థలం లేని కామన్నగారి పాకలు గ్రామ ప్రజల కన్నీటి గాథ ఇది...
పిఠాపురం రూరల్: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం శివారున ఉన్న గ్రామం కామన్నగారి పాకలు. ఈ గ్రామంలో సగ బాగం పిఠాపురం మున్సిపాలిటీ 15వ వార్డులోను, మరికొంత భాగం యు.కొత్తపల్లి మండల పరిధిలోనూ ఉంటుంది. గ్రామంలో ఎటువంటి మౌలిక వసతులు కావాలన్నా ఆ సమస్య ఎవరి పరిధిలోకి వస్తుందో తెలుసుకోవడానికే నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం వంటివి వీరికి ఇప్పటికీ దూరమనే చెప్పాలి. మౌలిక వసతుల మాట ఎలా ఉన్నా.. ఎవరైనా చనిపోతే ఆ గ్రామస్తుల బాధలు వర్ణనాతీతం. వీరికున్న అతి పెద్ద సమస్య చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడమే.
సాధారణంగా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం, బంధువులు తీరని వేదనకు గురవుతారు. కానీ కామన్నగారి పాకలు గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ ఊరు మొత్తం ఉలిక్కిపడుతుంది. మృతదేహాన్ని ఏ మార్గంలో తీసుకెళ్లాలి.. ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలి.. ఎవరి నుంచి ఎటువంటి అభ్యంతరాలు వస్తాయనే సందేహాలు ఈ గ్రామ ప్రజల్లో కనిపిస్తాయి. పూర్వీకుల కాలంలో గ్రామానికి శ్మశాన వాటిక, అక్కడకు వెళ్లేందుకు గ్రామం నుంచి మార్గం ఉండేవని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే, కాలక్రమంలో ఆక్రమణలకు గురై, అది కాస్తా కాలగర్భంలో కలిసిపోయింది. దీంతో, ఎవరైనా చనిపోతే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికకు కాలువలు, రోడ్లు దాటుకుంటూ మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన దుస్థితిని గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. తీరా అక్కడకు వెళ్లిన తరువాత ఎవరు తమను అడ్డుకుంటారోనని భయపడుతూంటారు. గతంలో తమ గ్రామానికి ఉన్న శ్మశాన వాటిక ఇప్పుడెలా మాయమవుతుందని ప్రశ్నిస్తున్నారు. శ్మశాన వాటిక వద్ద సర్వే చేసి, ఎవరైనా చనిపోతే ఆరడుగుల నేల చూపండి సార్.. అని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. మౌలిక వసతులు కల్పించకపోయినా.. కనీసం తమ శ్మశాన వాటిక తమకు ఇప్పించండి మహప్రభో... అంటూ కామన్నగారి పాకలు ప్రజలు అధికారులను కన్నీటితో వేడుకుంటున్నారు.
ఆక్రమణకు గురైంది
మా గ్రామంలో సుమారు 450 మంది ఉన్నారు. మా గ్రామ శ్మశాన వాటిక ఆక్రమణకు గురైంది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి అష్టకష్టాలు పడుతున్నాం. వర్షం కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మా శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.
– జి.కాంతం, కామన్నగారి పాకలు, పిఠాపురం
అధికారులకు చెప్పినా ఫలితం లేదు
గతంలో మా గ్రామానికి ఉన్న శ్మశాన వాటిక ఇప్పుడు లేకపోవడం ఆశ్యర్యం కలిగిస్తోంది. గ్రామంలో ఎవరైనా చనిపోతే కాలువలు,, రోడ్లు దాటుకుంటూ సుమారు 4 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని తీసుకెళ్లి, శ్మశానం ఉండే ప్రాంతానికి చేరుకోవాలి. ఈ సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. మా గ్రామ శ్మశాన వాటికను వెలికితీయాలని కోరుతున్నాం.
– గుబ్బల శ్రీను, కామన్నగారి పాకలు, పిఠాపురం


