● కలెక్టర్ విస్మయం
● తక్షణమే బెడ్ ఏర్పాటు
తుని: ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదన్న విషయం తుని ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సాక్షిగా వెలుగు చూసింది. ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రం ప్రారంభోత్సవానికి గురువారం వచ్చిన ఆయన ఇన్‌పేషెంట్ వార్డు పరిశీలనకు వెళ్లారు. ఆ సందర్భంగా ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులను పడుకోబెట్టి ఉండటం చూసి విస్మయం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న వైద్యులను మందలించి, వెంటనే ప్రత్యేక బెడ్ ఏర్పాటు చేయించారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూపరింటెండెంట్ మహేష్‌ను ఆదేశించారు. కెనరా బ్యాంకు సామాజిక నిధులు రూ.30 లక్షలతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ విభాగాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్ యనమల దివ్యతో కలసి కలెక్టర్ ప్రారంభించారు. అలాగే, మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య పనుల నిర్వహణకు రూ.30 లక్షల ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన జేసీబీని కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కమిషనర్ వెంకట్రావు, కెనరా బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
సబ్ జైలులో
యథావిధిగా ములాఖత్
కాకినాడ లీగల్: తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా కాకినాడ సబ్ జైలులో ముద్దాయిలను వారి బంధుమిత్రులు కలిసే (ములాఖత్) సమయం ఇటీవల మార్చారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో గతంలో మాదిరిగానే ములాఖత్ వేళలు మార్చారు. కాకినాడ స్పెషల్ సబ్ జైలు సూపరింటెండెంట్ ఎం.వీరబాబు గురువారం ఈ విషయం తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ములాఖత్‌కు అవకాశం కల్పించారు.


