పిఠాపురం రూరల్: ఏలేరు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని చివరి ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి నియోజకవర్గ వంగా గీత ఆధ్వర్యాన ఈ మేరకు కలెక్టర్ హరీంధర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఏలేరు నీటి విడుదలపై ఇప్పటి వరకూ అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. నీరు ఎప్పుడు విడుదల చేస్తారో, ఏయే ప్రాంతాలకు వంతుల వారీగా అందిస్తారో తెలియక అయోమయానికి గురవుతున్నామని రైతులు తెలిపారు. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం తక్కువగా ఉందనే వార్తల నేపథ్యంలో చివరి ఆయకట్టులో ఇప్పటి వరకూ నారుమళ్లు వేయలేదని, సాగు పనులు ప్రారంభించడంలో సందిగ్ధత నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
సత్యదేవునికి ఘనంగా
ఏకాదశి పూజలు
అన్నవరం: జ్యేష్ట బహుళ ఏకాదశి సందర్బంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి శుక్రవారం ఉదయం 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ పుష్పార్చన, కుంకుమార్చనలు జరిపారు. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
పోలింగ్ కేంద్రాల్లో
నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం చేసేందుకు శని, ఆదివారాల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎంఎన్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 14తో పూర్తి కానుందన్నారు. ఈ నెల 21న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ జరగనున్న నేపథ్యంలో జిల్లాలో డిజిటలైజేషన్ ప్రకియను నూరు శాతం పూర్తి చేసే లక్ష్యంతో ఈ రెండు రోజుల ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశామని వివరించారు. అర్హులైన ఓటర్ల వివరాలు జాబితా నుంచి తప్పిపోకుండా నమోదు ప్రక్రియను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పరిచారకుడికి
తిరిగి పోస్టింగ్
అన్నవరం: రత్నగిరి తొలి పావంచా వద్ద ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేతి డబ్బాలు అపహరించేందుకు ప్రయత్నించిన అర్చకుడికి సహాయం చేశాడనే అభియోగంతో సస్పెండైన పరిచారకుడు ఎన్‌ఎస్‌ఎస్ కృష్ణకుమార్‌కు ఏడాది తరువాత తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ బి.మహేష్‌రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది జూలై 17న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సుమారు రూ.20 వేల విలువైన మూడు ఆవునేతి డబ్బాలను అర్చకుడు సీహెచ్ హరగోపాల్ అపహరించే ప్రయత్నం చేస్తున్నాడనే సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేశారు. ఆ సందర్భంగా కనకదుర్గ గుడి దిగువన ఉన్న మూడు ఆవునేతి డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సందర్భంగా హరగోపాల్, కృష్ణకుమార్‌లను సస్పెండ్ చేశారు. నాలుగు నెలల క్రితం హరగోపాల్‌కు తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా కృష్ణకుమార్‌కు కూడా తిరిగి పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
తగ్గుముఖం పట్టిన గోదారి
దేవీపట్నం: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరద తగ్గుతున్నప్పటికీ గండిపోశమ్మ ఆలయ వద్ద ఇంకా అదే పరిస్థితి కొనసాగుతోంది. దండంగి నుంచి పోశమ్మగండికి వెళ్లే మార్గంలో రహదారిపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.


