కాకినాడ రూరల్: తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక లాభాల ఇస్తామంటూ ఎర వేసి, మోసం చేసిన ఆల్మైటీ జెనెసిస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు పులుగు మోజేష్, సందన లలితాంబికలను పోలీసులు అరెస్టు చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కిశోర్ కుమార్ ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కాకినాడ స్టేడియం రోడ్డులోని కేఆర్‌కే ప్లాజాలో 2023 జూలైలో ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిస్తామని, ప్రతి నెలా స్థిరమైన లాభాలు, ఫిక్స్‌డ్ రిటర్న్స్ అందిస్తామని ప్రజలను ఆ సంస్థ నిర్వాహకులు నమ్మించారు. ముందుగా పెట్టుబడి పెట్టిన వారికి కొన్నాళ్లు బాగానే చెల్లింపులు చేశారు. వారి మౌత్ పబ్లిసిటీతో తరువాత మరింత మంది పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఇస్తామన్న సొమ్ము ఇవ్వకపోవడంతో పెట్టుబడి పెట్టిన వారు ఆందోళన చెందారు. గత నెలాఖరున ఆ సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దీంతో, ఆ సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఆ సంస్థ నిర్వాహకులపై బారతీయ న్యాయ సంహితలోని 318 (4), 316 (2), 316 (5), 61 (2), 339, 351 (2), ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్–1999లోని సెక్షన్–5 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బాధితులు స్టేట్‌మెంట్లు సేకరించారు.
ఈ సంస్థలో మొత్తం 7,342 మంది రూ.98,66,92,943 మేర పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో కొనసాగుతున్న పెట్టుబడులు రూ.53,87,72,943గా నిర్ధారించారు. వీరిలో గత నెల 30వ తేదీకి 3,709 మంది పెట్టుబడులు ముగిశాయి. వీరికి రూ.16,13,66,096 మేర చెల్లించారు. ఇంకా 3,633 మందికి రూ.37,74,,06,847 మేర చెల్లించాల్సి ఉంది. ఈ కేసులో అరెస్టు చేసిన ప్రధాన నిందితులు మోజేష్, లలితాంబికల నుంచి ఆరు ల్యాప్‌టాప్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక కారు, బాండ్లు, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. ‘మోసం చేయాలనే ఆలోచనతోనే అధిక లాభాలు చూపారు. స్టాక్ మార్కెట్‌లో ఎవరైనా ఫిక్స్‌డ్ రిటర్న్స్ ఇవ్వగలరా? రూ.లక్షకు ప్రతి నెలా రూ.15 వేలు చెల్లించడం ఎలా సాధ్యం? అధిక లాభాలకు ఆశపడి ఎవ్వరూ మోసపోవద్దు’ అని అడిషనల్ ఎస్పీ కిశోర్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కాగా, ఈ కేసులోని నిందితుడు గతంలో వలసపాకలలో ఇటువంటి సంస్థను పెట్టి మూసివేసినట్టు పలువురు బాధితులు చెబుతున్నారు. ఆల్మైటీ జెనెసెస్ ద్వారా సేకరించిన పెట్టుబడులను తిరిగి చెల్లించాలని కోరుతున్నారు.
ఫ ఆల్మైటీ జెనెసిస్
బాధితులు 3,633 మంది
ఫ చెల్లించాల్సిన సొమ్ము రూ.37.74 కోట్లు
ఫ ఇద్దరు ఎండీల అరెస్టు
ఫ వెల్లడించిన అడిషనల్ ఎస్పీ


