అన్నదాతపై ధరవు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతపై ధరవు

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

ఖరీఫ్‌లో పెరిగిన ఎరువుల ధరలు

రైతులపై రూ.64.20 కోట్ల భారం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అన్నదాతలు ఖరీఫ్‌ పనుల్లో తలమునకలవుతున్న వేళ ప్రభుత్వ నిర్వాకంతో ఎరువుల ‘ధర’వు మోగుతోంది. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అన్నివిధాలా అండగా ఉంటామని చెబుతున్న కూటమి ప్రభుత్వం మాత్రం ఎరువుల ధరల పెరుగుదలపై నోరు మెదపడం లేదు. గతంలో రైతులు ఖరీఫ్‌ ముందు పశువుల ఎరువు, పచ్చిరొట్ట వేసి పొలంలో కలియదున్నేవారు. దీనివల్ల నేల సారవంతమై, రసాయన ఎరువుల వినియోగం తక్కువగా ఉండేది. ఇటీవల కూలీల కొరత, పశువులు తగ్గిపోవడంతో కంపోస్ట్‌ ఎరువులు వేసే వారి సంఖ్య క్రమేపీ తగ్గిపోయి, రైతులు ఎక్కువగా రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు. కొంతమంది అధిక దిగుబడుల కోసం మిశ్రమ ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు.

4.28 లక్షల బస్తాల వినియోగం

జిల్లావ్యాప్తంగా 2.14 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌ వరి సాగు చేస్తున్నారు. పంట కాలంలో ప్రతి రైతూ ఎకరానికి 2 బస్తాలకు తక్కువ కాకుండా కాంప్లెక్సు ఎరువులు వినియోగిస్తారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా ప్రతి సీజన్‌లోనూ 4.28 లక్షల బస్తాలకు పైగా ఎరువులు అవసరమవుతాయి. ప్రస్తుతం ఎరువుల ధరలు పెరగడంతో ప్రతి రైతుపై ఎకరానికి రూ.3 వేలకు పైగా అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం ఎరువులను యాప్‌ ద్వారా మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది.

కౌలు రైతులకు కష్టాలు

సొంతంగా పొలం ఉన్న రైతులు మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుంటేనే ఎరువులు ఇస్తున్నారు. వారి వరకూ బాగానే ఉన్నప్పటికీ ఎరువుల కోసం ఎక్కువగా కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి తమ సర్వే నంబర్లు ఇచ్చేందుకు భూ యజమానులు ఇష్టపడటం లేదు. దీంతో, సకాలంలో ఎరువులు అందక, బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితిని కౌలు రైతులు ఎదుర్కొంటున్నారు. దీనివలన ఇప్పటికే పెరిగిన రేట్లకు అదనంగా బస్తాకు రూ.200 నుంచి రూ.300 అదనంగా చేతిచమురు వదిలిపోతోందని వారు గగ్గోలు పెడుతున్నారు. ఎరువులు ధరలు పెరగడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

అందుకే ‘ధరా’భారం

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మన దేశానికి దిగుమతి అయ్యే సల్ఫర్‌, ఫాస్ఫరస్‌, యూరియా ఎరువుల ముడి పదార్థాల రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఇదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలు వ పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీయ ఎరువుల తయారీ కంపెనీలు వీటి ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. పంటలకు రైతులు సుమారు 16 రకాల ఎరువులు వినియోగిస్తూండగా వీటిలో 14 రకాల ధరలు పెరిగాయి. సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ ధర అత్యధికంగా రూ.950 వరకూ (46.15 శాతం) పెరిగింది. యూరియా, డీఏపీ ధరలు నిలకడగా ఉన్నప్పటికీ మిశ్రమ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 20.20.0.13 మిశ్రమ ఎరువు ధరను ఏకంగా రూ.700 పెంచేశారు. దీంతో పాటు 10.26.26, పొటాష్‌, అ మ్మోనియం సల్ఫేట్‌ ధరలు పెరిగాయి. రైతులు భూ సార పరీక్షలు చేయించుకుని, వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులు వాడుకుంటే పెట్టుబడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

ధరలు తగ్గించాలి

కూలీలు దొరక్క, పెట్టుబడులు పెరిగి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఖరీఫ్‌లో ఎరువులు ధరలన్నీ పెరగడంతో పెట్టుబడి వ్యయం కూడా భారీగా పెరుగుతుంది. ఎరువుల ధరలు నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే కనీసం ధాన్యానికి గిట్టుబాటు ధరనైనా పెంచాలి.

– కర్నీడి వీర్రాజు, రైతు, తిమ్మాపురం, కాకినాడ రూరల్‌

ఎరువులు ధరల పెరుగుదల ఇలా (రూ.)

ఎరువు రకం రబీ ప్రస్తుతం

20.20.0.13 1,550 2,250

10.26.26 2,000 2,250

14.35.14 1,900 2,350

15.15.15 1,650 2,025

16.16.16 1,675 2050

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement