బోట్‌క్లబ్(కాకినాడసిటీ): జాతీయ కోర్కెల దినోత్సవం సందర్భంగా ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యాన అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతి మాట్లాడుతూ, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, కూటమి ప్రభుత్వ హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ నవచేతన యాప్ పని అంగన్‌వాడీలతో చేయించరాదని, పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్ ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పి 11 ఏళ్లవుతున్నా ఒక్క రూపాయి కూడా పెంచలేదని, రాష్ట్రంలో వేతనం పెంచి ఏడేళ్లవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నిత్యావసర సరకులు ధరలు, ఇంటి అద్దెలు, గ్యాస్, కరెంట్ బిల్లులు వందల రెట్లు పెరిగాయని అన్నారు. ఇచ్చే రూ.7 వేల జీతం సెంటర్ అద్దెలకు, నిర్వహణకే సరిపోతోందని, ఇక తాము ఏం తిని బతకాలని ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న గ్రాట్యుటీ అమలును నిబంధనల పేరుతో, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు లేవనే సాకుతో జిల్లా అధికారులు అడ్డుకుటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వంట కోసం ఇచ్చిన ఇండక్షన్ స్టవ్ వల్ల వచ్చే కరెంటు బిల్లును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జగ్గంపేట, తాళ్లరేవు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఆయా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఆ భారం మొత్తం టీచర్లపై పడుతోందన్నారు. తక్షణం ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్రమోషన్లకు ఐదేళ్ల సర్వీస్ నిబంధన తొలగించి, స్థానిక ఆయాలతో వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుడ్లు సకాలంలో అందించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ పేరుతో గర్భిణులను, బాలింతలను ఇబ్బందులకు గురి చేయరాదని కోరారు. అనంతరం ఐసీడీఎస్ పీడీ చెరుకూరి లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీల ఆందోళనకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషుబాబ్జీ, కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు ధనలక్ష్మి, ఎస్తేరు రాణి, ఎం.రాజేశ్వరి, వీరవేణి, వీరమణి, సునీత, బాంధవి, చామంతి తదితరులు పాల్గొన్నారు.
ఫ వేతనాలు పెంచాలి
ఫ నవచేతన యాప్ రద్దు చేయాలి
ఫ పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్
ఫ కలెక్టరేట్ ముట్టడి


