గద్వాల: అన్ని అవయవాల కంటే కళ్లు ప్రధానమని అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారని, కళ్లను సంరక్షించుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటిపరీక్షలు నిర్వహించిన అనంతరం కంటి సమస్య ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ఆరోగ్యజాగ్రత్తలు పాటించాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యక్రమాలైన నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ బ్లైండ్‌నెస్ రాష్ట్రీయ బాలస్వస్థ కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1784 మంది విద్యార్థులు కంటి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మొదటి విడతగా 361మంది విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధవహించి కష్టపడి చదువుకోవాలన్నారు. గట్టు, కేటిదొడ్డి మండలాల నుంచి 9మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం జరిగిందన్నారు. ప్రతిఒక్కరు కష్టపడి చదివి ఉన్నతవిద్యను అభ్యసించాలన్నారు. ఈసందర్భంగా తమ పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య నెలకొందని దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఓ విద్యార్థి కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తూ మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను బాగా రాసి ప్రతి విద్యార్థి కూడా 10 జీపీఏ సాధించాలన్నారు. వారికి ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించడం జరుగుతుందన్నారు.
కలెక్టర్ బీఎం సంతోష్
1784 మంది విద్యార్థులకు
కంటి పరీక్షలు
కష్టపడి చదవాలి
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంపై వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. అదేవిధంగా చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మనిషి ఎదుగుదలకు చదువే ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ మాత్రమే లేదని, మిగిలిన అన్ని రకాల కాలేజీలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే అందరూ కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో అందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సిద్దప్ప, డీఈఓ అబ్దుల్‌ఘని, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.