వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో జాగృతి
గద్వాల టౌన్/అలంపూర్/ధరూరు/కేటీదొడ్డి/: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా జాగృతి వైపు నుంచి మేం పోటీలో ఉంటాం.. పేరు అదే ఉంటదా.. ఇంకొకటి ఉంటదా.. అనేది సెకండరీ.. 2029లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రోజుల జాగృతి జనంబాట కార్యక్రమం అనంతరం సోమవారం గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీకి మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులే నాపై కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, వద్దంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని చెప్పారు. తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో ‘మన ఊరు– మన ఎంపీ’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసే ప్రకటనలు శుద్ధ అబద్దమని విమర్శించారు. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్షరాస్యతలో గద్వాల ప్రాంతం అత్యంత వెనకబడి ఉండటం చాలా బాధాకరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గద్వాలపై ప్రత్యేక దృష్టిపెట్టి విద్యారంగం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నిత్యం జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. గురుకుల పాఠశాలల అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉండటం దారుణమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట చేపట్టిందని వివరించారు.
● అంతకుముందు ధరూరు మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి పంపుహౌస్, రిజర్వాయర్‌ను, కేటీదొడ్డి మండలం మల్లాపురం తండా శివారులో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ పనులను ఆమె పరిశీలించారు. అలాగే, అలంపూర్ జోగుళాంబ ఆల యాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.


