కొలువుదీరనున్నారు..!
నేడు సర్పంచ్, వార్డుమెంబర్ల ప్రమాణ స్వీకారం
● ప్రత్యేక అధికారుల పాలనలో
ఎక్కడి సమస్యలు అక్కడే
● కొత్త సర్పంచ్‌లపైన కోటి ఆశలు
● జిల్లాలో 255 మంది సర్పంచ్‌లు.. 2,387 మంది వార్డు సభ్యులు
అలంపూర్: గ్రామాల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీలు, 2387 వార్డు మెంబర్ల సభ్యులకు ఎన్నికలు జరగగా.. విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు ఈ నెల 22న (నేడు) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎట్టకేలకు సోమవారం నుంచి నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల పాలన సాగనుంది. దాదాపు రెండేళ్లపాటు ఖాళీగా ఉన్న పంచాయతీలు సర్పంచ్‌ల రాకతో కళకళాడనున్నాయి. ప్రజా మద్దతు కూడగట్టి పాలన పగ్గాలు చేతబట్టిన సర్పంచ్‌లు ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోగా.. కొత్త సర్పంచ్‌ల రాకతో అయినా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ప్రజలు ఆశిస్తున్నారు.
రెండేళ్లు ప్రత్యేక అధికారుల పాలన
జిల్లాలోని గ్రామ పంచాయతీలు దాదాపు రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. పంచాయతీలకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు లేకుండానే కొనసాగాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడంతో పంచాయతీల పాలకవర్గం కొలువుదీరనుంది. 2019 జనవరి 30వ తేదీన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 2వ తేదీన గత సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి నుంచి పంచాయతీల పాలన పూర్తిగా ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారులు గ్రామ పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఈ నెల 22వ తేది నుంచి సర్పంచ్‌ల పాలన ఆరంభం కానుంది.
కొత్త వారిపైనే కోటి ఆశలు..
గ్రామాల్లో దాదాపు రెండేళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై కొత్తగా బాధ్యతలు స్వీకరించే సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులపైనే ప్రజలు ఆశలు ఉంచారు. కొత్తగా వచ్చిన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా మారింది. పారిశుద్ధ్యం లోపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీ వ్యవస్థతో గ్రామాల్లో కాలనీలు మురికి కుంటలుగా మారాయి. రోడ్ల నిర్మాణాలు లేక అంతర్గత రోడ్లపై నడవడానికి సాహసం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో వీధి లైట్లు లేక రాత్రిళ్లు చీకట్లు కమ్మేస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి వసతి లేక శీతాకాలంలోనే తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఇలా అనేక సమస్యలతో గ్రామ పాలన కుంటుపడింది. అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్ధులే గ్రామాలను జేజిక్కించుకున్నారు. స్వతంత్రులుగా గెలిచిన వారు సైతం కొన్ని పార్టీలకి జైకొట్టే అవకాశం ఉంది. మరీ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ది ఉంటుందో వెచి చూడాలి మరి...!
కొలువుదీరనున్నారు..!


