గాంధీజీ పేరు తొలగించడం అనైతికం
గద్వాలటౌన్: జాతిపిత మహాత్మాగాంధీ ప్రతిష్టను తగ్గించడం కోసమే ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించారని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముని పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం స్థానిక గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకానికి గాంధీ పేరు తొలగింపు చర్య దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమన్నారు. ఇలాంటి చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు, మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పఽథకాన్ని తెచ్చిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి పథకంలో నిధుల కోత పెట్టిందని, ప్రస్తుతం పేరు మార్చతున్నారని మండిపడ్డారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యామన్నారు. కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ గాంధీ పేరును పెడుతామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరహరిగౌడ్, శ్రీనివాసులు, కృష్ణ, సుదర్శన్, వెంకటేష్, శ్రీనివాస్‌యాదవ్, అన్వర్, రిజ్వాన్, గోవిందు, ప్రవీణ్, నాగులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


