ఆర్డీఎస్ సాగునీటి కోసం పాదయాత్ర చేస్తా
అలంపూర్/గద్వాల టౌన్: ఆర్డీఎస్ పూర్తిస్థాయి సాగునీటి వినియోగం కోసం పాదయాత్ర చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జనంబాటలో భాగంగా ఆదివారం అలంపూర్ నియోజకవర్గం మానవపాడు, అయిజ, గద్వాల, ధరూరు మండలాల్లో పర్యటించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్డీఎస్ వాటా 16 టీఎంసీలు వాడుకోవడానికి ఆయకట్టు స్థిరీకరణకు తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మించారని చెప్పారు. ఇక్కడ మూడు మోటార్లు ఉంటే ఒక్కటే వాడుతున్నారని, మిగిలిన రెండు మోటార్లు వాడుకోవాలంటే కాల్వ విస్తరణ, భూ సేకరణతోపాటు రైతులు ఒక ఏడాది పంట మానుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను బీఆర్‌ఎస్ నిర్మించిన కనీసం అందులో సగం కెపాసిటి నీటిని వాడుకోలేకపోతున్నామని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై నిర్లక్ష్యంగా వహిస్తుందన్నారు. గతంలో ఆర్టీఎస్ అంశంపై కేసీఆర్ పాదయాత్ర చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని, దీనిని వెంటనే పూర్తి చేయకపోతే తాను కూడా పాదయాత్ర చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానిక రైతులతో కలిసి ఉద్యమిస్తానని భరోసా ఇచ్చారు. గుండ్రేవుల, ప్రాజెక్ట్, ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు మీతో కలిసి పోరాటం చేస్తానని వారికి భ రోసానిచ్చారు.
సీడ్‌పత్తి రైతుల సమస్యలపై సీఎంతో మాట్లాడుతా
సీడ్‌పత్తి రైతులు నష్టపోకుండా కంపెనీలు అగ్రిమెంట్ చేసుకోవాలని, ఈ విషయంలో అవసరమైతే సీఎంతో మాట్లాడుతానని అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో సమస్యలు అధికంగా ఉన్నాయని, నాసిరకంగా నిర్మించడం వల్ల మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంచారన్నారు. పాలమూరు సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయినా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రులపై దృష్టిసారించడం లేదని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో రోడ్లు భయంకరంగా ఉన్నాయని, గద్వాలలో చేనేత కార్మికులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పర్యటనలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


