నూతన విద్యా విధానంతో తీవ్ర నష్టం
గద్వాలటౌన్: నూతన విద్యావిధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని, దీని వలన పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిడంతో పాటు నాణ్యమైన విద్యా దూరమవుతుందని యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు రవిప్రసాద్‌గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతిసేలా ఉన్న జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యావిధానం రద్దు అయ్యే వరకు మన పోరాటం ఉండాలన్నారు. పార్లమెంటులో పెన్షన్ బిల్లు ఆమోదం పొందడం వలన ప్రస్తుతం ఉన్న పెన్షన్‌దారులకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లోని డీఏలును, పీఆర్సీ ఆరియర్లను, ఇతర ట్రైజరీ బిల్లులను త్వరగా క్లియర్ చేయాలని కోరారు. కేజీబీవీ, గురుకుల, మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కిష్టయ్య, రామన్‌గౌడ్, స్వామి, జిల్లా అధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు కుమార్‌నాయుడు, బీసన్న, తిమ్మప్ప, రాజశేఖర్, చంద్రకాంత్, తిలక్, రాజశేఖర్ పాల్గొన్నారు.
తపస్ జిల్లా అధ్యక్ష,
కార్యదర్శుల ఎన్నిక
గద్వాలటౌన్ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన తపస్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తపస్ జిల్లా అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగరాజులను ఎన్నికయ్యారు. ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఎన్నికల పరిశీలకులుగా వెంకటరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నరేష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ..ఉపాధ్యాయులకు రావాల్సిన అయిదు డీఏలతో పాటు ఈ–కుబేర్‌లో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఆర్సీని ప్రకటిస్తామన్న హామీ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోవడం ఏంటని ప్రశ్నించారు. సమస్యల సాధన కోసం దశల వారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి
నాగర్‌కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో వచ్చే నెల 25 నుంచి 28 వరకు కొనసాగుతాయని.. పెద్దఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఆమె మాట్లాడారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నూతన విద్యా విధానంతో తీవ్ర నష్టం


