వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయే..
● నేటి నుంచి గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహణ
● పాల్గొననున్న 175 పాఠశాలల విద్యార్థులు
● ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు
గద్వాలటౌన్: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను డీఈఓ విజయలక్ష్మితో పాటు పలువురు సైన్స్ అధికారులు, జీహెచ్‌ఎంలు ఆదివారం పరిశీలించారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రదర్శనల్లో పాల్గొంటున్నాయి. జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 175 పాఠశాలల నుంచి సుమారు 250 వరకు ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. ఇందులో 2024–25 సంవత్సానికి సంబంధించిన ఇన్‌స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన తప్పనిసరి చేశారు. జూనియర్ (6,7 తరగతులు), సీనియర్ (8,9,10 తరగతులు) రెండు విభాగాలుగా విభజించి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రదర్శనకు వచ్చే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు భోజనం, వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్, జూనియర్ విభాగాల నుంచి ప్రతి అంశంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మొత్తం 14 ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ‘అభివృద్ధి చెందిన భారతదేశం– స్వయం సమృద్ధి భారతదేశం’ అనే ప్రధాన అంశంపై నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు ఉప అంశాలను చేర్చారు.
ఏయే అంశాలపై..
సుస్థిర వ్యవసాయం
వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు
ప్రత్యామ్నాయం
హరిత శక్తి
అభివృద్ది చెందుతున్న సాంకేతికలు
వినోద గణిత నమూనా
ఆరోగ్య, పరిశుభ్రదత
నీటి సంరక్షణ, నిర్వహణ
కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా..
జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు కలెక్టర్ సంతోష్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నారు. సోమవారం ఉదయం స్థానిక అనంత ఫంక్షన్‌హాల్‌లో జరిగే ప్రారంభోత్సవానికి వీరందరూ హాజరవుతున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని అధికారులు కోరారు. ఈ ప్రదర్శనకు ‘శ్రీనివాస రామానుజన్’ అనే పేరును నామకరణం చేశారు.
వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయే..


