సమాజానికి మేలు చేసే ప్రాజెక్టులు రూపొందించాలి
● కలెక్టర్ సంతోష్
● ఘనంగా జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం
గద్వాలటౌన్: విద్యార్థులు ప్రకృతితో మమేకమవుతూ సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు, ప్రాజెక్టులు రూపొందించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి తరం విద్యార్థులు విజ్ఞాన ఆవిష్కరణలపై ఆసక్తిని చాటుతూ పలు సమస్యలకు పరిష్కారాన్ని చూపించేలా వాటిని రూపొందించాలని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని, ఆ దృష్టితో విద్యార్థులు పరిశోధనలు సాగించాలన్నారు. గద్వాలలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
● గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రదర్శనలను ఆవిష్కరించాలని సూచించారు. విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానానికి కొదవ లేదని, దీనిని ప్రజాపరం చేసే ఆలోచన ప్రభుత్వాలకు ఉన్నప్పుడే పలు సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు.
● అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ విద్యార్థులు నిర్మాణాత్మక ఆలోచనలతో ఎదుగుతూ వారు తయారు చేసే ఆవిష్కరణలతో దేశం పులకించిపోవాలని పేర్కొన్నారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రాన్ని మానవాళి మనుగడకు ఉపయోగించాలని కోరారు. శాసీ్త్రయ విద్యా ప్రమాణాలు ఉన్న విద్యార్థులను మరో కోణంలో నిలబెడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్‌పాపన్న తదితరులు పాల్గొన్నారు.


