గ్రామాల్లో నవశకం..
పంచాయతీల్లో కొలువుదీరిన పాలక వర్గాలు
సంబురంగా
ప్రమాణ స్వీకారాలు
జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం సంబురంగా నిర్వహించారు. కొత్త పాలక వర్గం ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని కొన్ని చోట్ల పంచాయతీ భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. మరికొన్ని చోట్ల రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పండగ వాతవరణంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలోని 255 పంచాయతీలు, 2390 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లో 40 మంది సర్పంచ్‌లు, 719 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా స్థానాలకు ఎన్నికలు జరగగా.. 215 మంది సర్పంచ్‌లు, 1668 మంది వార్డుమెంబర్లు విజయం సాధించారు. ఇదిలాఉండగా, ఉండవెల్లిలోని బస్వాపురంలో మూడు వార్డులకు నామినేషన్ల తిరస్కరణతో 3 వార్డులకు ఎన్నికలు జరగలేదు. ఏకగ్రీవంగా, ఎన్నికల బరిలో నిలిచిన వారిలో ఒక్క జల్లాపురం మినహా మిగిలిన చోట సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డుల సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు.
అలంపూర్: పంచాయతీల పాలక వర్గం కొలువుదీరింది. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంచాయతీల్లో పాలక వర్గం సందడి ఆరంభమైంది. కొత్త పాలక వర్గం సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంతో పల్లెల్లో పండగా వాతవరణం నెలకొంది. జిల్లాలో పంచాయతీల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. పంచాయతీల పాలక వర్గ ప్రమాణ స్వీకారంలో వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి.
విధులు.. బాధ్యతలు
గ్రామ పంచాయతీల పరిపాలకులుగా సర్పంచులు వ్యవహరిస్తూ గ్రామసభలు నిర్వహించాలి. ఎన్నిక తర్వాత 15 రోజుల్లో తొలి గ్రామసభ జరపాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చొరవ తీసుకోవాలి. బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉంటుంది. పంచాయతీ ఆర్థిక నిర్వహణ, లాభనష్టాల రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల్లో పారదర్శకత ఉండాలి. ఇదిలాఉండగా, ఎన్నో ఆశలు, ఆశయాలతో కొలువుదీరిన పంచాయతీల పాలకవర్గాలకు నిధులలేమి అసలు సమస్యగా కనిపిస్తోంది.
బాధ్యతలు చేపట్టిన 255 మంది సర్పంచులు, 2387 మంది వార్డు మెంబర్లు
జల్లాపురంలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా
జీపీ భవనాల్లేక చెట్ల కింద, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణ స్వీకారం
గ్రామాల్లో నవశకం..


