ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
గద్వాలన్యూటౌన్: ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలతో ఎస్‌ఐఆర్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ మ్యాపింగ్ ప్రక్రియపై ఇప్పటికే జిల్లాలోని బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 45శాతం మ్యాపింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. 40శాతం కన్నా తక్కువ మ్యాపింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్‌లను గుర్తించి, అక్కడ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, ఎన్నికల విభాగం అధికారి కరుణాకర్, తహశీల్దార్లు పాల్గొన్నారు.
ప్రజావాణిలో
అర్జీదారుల మొర
గద్వాలటౌన్: ప్రజల ముంగిటకు పాలన రావడంతో గద్వాల కలెక్టరేట్ కిటకిటలాడింది. కలెక్టర్, అడిషినల్ కలెక్టర్లకు వినతులు, సమస్యలు చెబితే పరిష్కారం అవుతాయనే ఉద్దేశ్యంతో బాధితులు తరలివచ్చారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ప్రజావాణికి వచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజావాణి కొనసాగింది. మొత్తం 42 దరఖాస్తులు అందాయి. ప్రజావాణిలో అధికారులు బాధితుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను విన్నారు. సంబంధిత శాఖల అధికారులను పిలిపించి పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆసరా పెన్షన్లు, భూసంబంధిత, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్తు తదితర సమస్యలపై వినతలు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల అలసత్వం వద్దని అడిషినల్ కలెక్టర్లు సంబంధిత అధికారులకు సూచించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 10 వినతులు
గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 10 వినతులు అందగా.. ఎస్పీ శ్రీనివాసరావు వారితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడంలేదు తదితర కారణాలతో 10 మంది వినతులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కారం చేకూరుస్తామని బాధితులకు వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు.


