దేశం గర్వించే స్థాయికి ఎదగాలి
గద్వాలటౌన్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు సూచించారు. మంగళవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం, దేశం అభివృద్ధిలో ముందుకుసాగాలంటే పరిశోధనలు ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థులను తరగతి గదిలో కంటే ప్రయోగశాలల్లోనే ఎక్కువగా ఉంచి.. కొత్త విషయాలను తెలియజేయాలన్నారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచుకొని భవిష్యత్‌లో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. నేటి బాలబాలికల్లో భావి శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉంటారని.. వారిని గుర్తించాల్సిన బాధ్యత గురువులదేనని అన్నారు. కాగా, సీనియర్, జూనియర్ విభాగాల్లో ఏడుగురు చొప్పున, టీచర్ ఎగ్జిబిట్, సెమినార్, ఇన్స్‌ఫెయిర్ మనక్ విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. వచ్చే నెల హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి ప్రదర్శనలో వీరు పాల్గొంటారని జిల్లా సైన్స్ అఽధికారి బాస్కర్ పాపన్న తెలిపారు. అనంతరం జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో అత్యుత్తమ ప్రదర్శన చాటిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలను అందజేశారు.


